సాక్షి, అమరావతి: అసైన్డ్ భూముల రైతుల తలరాతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అసైన్డ్ భూములు పొందిన పేదలకు వాటిపై సంపూర్ణ హక్కులు కల్పి స్తూ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది.
అసైన్డ్ భూములు కేటాయించి (అసైన్ చేసి) 20 ఏళ్లు పూర్తయితే వాటిని పొందిన వారికి ఆయా భూములపై యాజమాన్య హక్కులను కల్పించింది. ఈమేరకు 1977 ఏపీ అసైన్డ్ భూముల చట్టం (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్) సవరణను ఆమోదిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేశారు.
మంత్రివర్గ కమిటీ సిఫారసు మేరకు
భూమి లేని నిరుపేదలు వ్యవసాయం చేసుకుని దానిపై వచ్చే ఆదాయంతో జీవించేందుకు ప్రభుత్వాలు భూమిని కేటాయిస్తాయి. స్వాతం్రత్యానికి ముందు, ఆ తర్వాత రాష్ట్రంలో ఇలా లక్షల ఎకరాలను పేదలకు ఇచ్చారు. వాటికి చట్టపరంగా రక్షణ కల్పించేందుకు 1977లో అసైన్డ్ భూముల చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం ప్రభుత్వం అసైన్ చేసిన భూములపై అమ్మకాలు, కొనుగోళ్లు జరిపే అవకాశం లేకుండా నిషేధం విధించారు. దీంతో అత్యవసర సమయాల్లో భూమిని విక్రయించుకునేందుకు నిరుపేదలకు అవకాశం లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో భూములపై తమకు యాజమాన్య హక్కులు కల్పించాలంటూ నిరుపేద అసైన్డ్ రైతుల నుంచి ప్రభుత్వానికి చాలాసార్లు వినతులు వచ్చాయి. ఈ క్రమంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో నలుగురు మంత్రులు, ఎమ్మెల్యేలతో గతేడాది సెపె్టంబర్ 30న కమిటీని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై విస్తృతంగా అధ్యయనం చేసిన కమిటీ అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించిన తమిళనాడు, కర్నాటకలో పర్యటించి అక్కడి విధానాలను పరిశీలించింది.
అసైన్డ్ భూములపై హక్కులు కల్పించిన కేరళలో కూడా అధ్యయనం చేసింది. వాటన్నింటినీ పరిశీలించడంతోపాటు రాష్ట్రంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది. కేటాయించి 20 ఏళ్లు పూర్తయితే సంబంధిత రైతులకు అసైన్డ్ భూములపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వం ఎవరికి భూమి కేటాయించిందో వారికే యాజమాన్య హక్కులు ఇవ్వాలని స్పష్టం చేసింది.
జిల్లాలవారీగా జాబితాలు..
కమిటీ సిఫారసులను ఆమోదించిన మంత్రివర్గం అందుకు అనుగుణంగా అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించాలని తీర్మానించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున వెంటనే చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రభుత్వం అసైన్ చేసిన వ్యవసాయ భూములతోపాటు పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలకు సైతం ఇది వర్తిస్తుందని సవరణ చట్టంలో స్పష్టం చేశారు.
కేటాయించి పదేళ్లు దాటితే ఆయా ఇళ్ల స్థలాలపై లబ్దిదారులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. దీనిపై 2021లోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా ఇప్పుడు చట్టంలోనూ అందుకు వీలు కల్పించింది. వ్యవసాయ భూములైతే కేటాయించిన 20 ఏళ్లకు, ఇళ్ల స్థలాలైతే కేటాయించి పదేళ్లు పూర్తయిన వెంటనే వాటిపై సంబంధిత రైతులు, పేదలు, వారి వారసులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి.
వ్యవసాయేతర భూములను ఆనుకుని ఏవైనా అసైన్డ్ భూములు ఉంటే వాటిని అమ్ముకున్నప్పుడు ప్రస్తుత బేసిక్ మార్కెట్ విలువ చెల్లించాల్సి ఉంటుంది. చట్టం అమలుకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలను విడుదల చేయనుంది. వాటి ప్రకారం జిల్లాలవారీగా 20 ఏళ్లు పూర్తయిన అసైన్డ్ భూముల జాబితాను రూపొందిస్తారు.
1954 నుంచి 2014 వరకు రాష్ట్రంలో 33.29 లక్షల ఎకరాలను పేదలకు అసైన్ చేశారు. తాజా చట్ట సవరణ ప్రకారం 2003కి ముందు ఇచ్చిన భూములన్నింటిపైనా యాజమాన్య హక్కులు లభిస్తాయి. 1954 నుంచి 2003 వరకు 28 లక్షల ఎకరాలకుపైగా భూములను పేదలకివ్వగా వారంతా ఇప్పుడు లబ్ధి పొందనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment