సాక్షి, అమరావతి: కళ్లార్పకుండా అబద్ధాలను వల్లించడంలో తాను గోబెల్స్‌ను మించిపోయిన విషయాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి రుజువు చేసుకున్నారు! టీడీపీ అనుబంధ విభాగం ఐ–టీడీపీని వికృత పోస్టులకు అడ్డాగా మార్చేసిన ఆయన అసభ్యకర పోస్టులు పెట్టే శ్వేతా చౌదరి అలియాస్ స్వాతిరెడ్డిని నిస్సిగ్గుగా సమర్థించడం విస్మయం కలిగిస్తోంది. పైగా ఆమె బీసీ మహిళా అంటూ బుకాయించడం గమనార్హం.
స్వాతి రెడ్డి ఎందుకు అయ్యారంటే...
కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోట శ్వేతాచౌదరి మారుపేరుతో స్వాతిరెడ్డినంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం వెనుక టీడీపీ పక్కా పన్నాగం దాగుంది. తిరుపతికి చెందిన ఆమె నర్సింగ్ కోర్సు చేసి హాస్పిటల్ మేనేజ్‌మెంట్ చదివేందుకు స్టూడెంట్ వీసాపై లండన్‌లో ఉంది. ఐ–టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తోంది.
కువైట్ టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగంలో క్రియాశీలకంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్, ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగతంగా అసభ్యకర పోస్టులను సోషల్ మీడియాలో వైరల్ చేయడమే లక్ష్యంగా ఐ–టీడీపీ ఆమె పేరు, సామాజికవర్గం పేరును మార్చేసింది.
శ్వేతా చౌదరిని ఏకంగా స్వాతి రెడ్డిగా మార్చి సోషల్ మీడియాలో అకౌంట్ తెరిచింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా కించపరుస్తూ అసభ్యకర రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఆమెను నిస్సిగ్గుగా వెనకేసుకు రావడం ద్వారా ఈ కుట్ర వెనుక తాను ఉన్నట్లు చంద్రబాబు చెప్పకనే చెప్పారు!
ఆమె కుటుంబానికీ సంక్షేమ పథకాలు..
ముఖ్యమంత్రి జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్న శ్వేతా చౌదరి అలియాస్ స్వాతి రెడ్డి కుటుంబానికి కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోంది. ఆమె తండ్రి కోట విశ్వనాథ్ ప్రస్తుతం ఆ కుటుంబానికి దూరంగా మదనపల్లిలో మరో మహిళతో కలసి జీవిస్తున్నారు.
వారిద్దరికీ రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు– పేదలు అందరికీ ఇళ్లు’ పథకం కింద విడివిడిగా ఇళ్లను మంజూరు చేసింది. అయితే వారిద్దరూ తమకు పక్కపక్కనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని కోరుతున్నారు. శ్వేతాచౌదరి తండ్రి జీవించి ఉన్నప్పటికీ తిరుపతిలో నివసిస్తున్న ఆమె తల్లి లలిత వితంతు పింఛన్ పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment