సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పాల్గొనే అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సంబంధిత శాఖాధిపతులు, కార్యదర్శులు వెంటనే చర్యలు తీసుకుని ఈ నెల చివరి వారంలోగా బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు.
ఈ నెలాఖరుకల్లా బదిలీల, పోస్టింగ్‌ల నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉంటుందని తెలిపారు. మూడేళ్లు ఒకచోట, ఒకే జిల్లాలో పనిచేస్తున్న అధికారులను బదిలీలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పాల్గొనే అధికారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. ఆ ఉత్తర్వుల మేరకు..
♦ నాలుగు సంవత్సరాల్లో.. జిల్లాలో మూడు సంవత్సరాలు పూర్తిచేసిన అధికారులు, లేదా ఈ ఏడాది జూన్ 30 లేదా అంతకుముందు 3 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఉద్యోగులను మరో జిల్లాకు బదిలీ చేయాలి.
♦ ఎన్నికలకు సంబంధం ఉన్న ఏ అధికారిని సొంత జిల్లాలో కొనసాగించడానికి వీల్లేదు.
♦ జిల్లా అధికారులతో పాటు నిర్దిష్టంగా ఎన్నికల విధులకు నియమించిన జిల్లా ఎన్నికల అధికారులు, ఉప ఎన్నికల అధికారులు, ఏఆర్‌వోలు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, నోడల్ అధికారులతో పాటు డిప్యూటీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, తహసీల్దార్లు, బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారులతో సహా ఇంకా ఎన్నికలకు సంబంధించిన అధికారులందరికీ బదిలీల నిబంధనలు వర్తిస్తాయి. మున్సిపల్ కార్పొరేషన్, డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులకు కూడా బదిలీల నిబంధనలు వర్తిస్తాయి.
♦ పోలీసుశాఖకు కూడా బదిలీల నిబంధనలు వర్తిస్తాయి. అదనపు డీజీలు, ఐజీలు, డీఐజీలు, రాష్ట్ర ఆర్మ్‌డ్ పోలీసులు, ఎస్‌ఎస్‌పీలు, ఎస్‌పీలు, అదనపు ఎస్‌పీలు, సబ్ డివిజనల్ హెడ్ ఆఫ్ పోలీసు, ఎస్‌హెచ్‌వోలు, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, జిల్లాస్థాయిలో ఎన్నికల బందోబస్తుకు ఉపయోగించే పోలీసు బలగాలకు వర్తిస్తాయి.
♦ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్లను వారి స్వంత జిల్లాలో నియమించకూడదు.
♦ ఒక పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ నాలుగేళ్లలో 3 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తిచేస్తే మరో పోలీసు సబ్ డివిజన్‌కు బదిలీ చేయాలి. ఆ సబ్ డివిజన్ అంతకుముందు పనిచేసిన అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండకూడదు. లేదంటే మరో జిల్లాకు బదిలీ చేయాలి.
♦ ఎక్సైజ్ అధికారులకు బదిలీ నిబంధనలు వర్తిసాయి. సబ్ ఇన్‌స్పెక్టర్, అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న రాష్ట్రంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులకు కూడా బదిలీల నిబంధనలు వర్తిస్తాయి.
♦ఎన్నికలతో నేరుగా సంబంధం లేని వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు బదిలీలుండవు. అయితే వారిలో ఎవరైనా రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తే.. విచారణలో రుజువైతే.. అటువంటి అధికారిని బదిలీ చేయమని ఆదేశించడంతోపాటు శాఖాపరమైన చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేస్తుంది.
♦ గతంలో కేంద్ర ఎన్నికల సంఘం క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసి పెండింగ్‌లో ఉన్న అధికారులు లేదా గతంలో ఎన్నికలకు సంబంధించి ఏదైనా తప్పుపట్టిన, అభియోగాలు మోపిన అధికారులకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులను అప్పగించకూడదు. గతంలో ఎన్నికల సమయంలో బదిలీ చేసిన అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు.
♦ అధికారిక పనితీరుకు సంబంధించిన క్రిమినల్ కేసు ఏదైనా న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంటే అలాంటి అధికారులు ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండకూడదు.
♦ ఆరునెలల్లో పదవీ విరమణ చేయనున్న అధికారులు ఎవరైనా ఎన్నికల సంబంధిత పోస్టులో ఉంటే ఆ వ్యక్తిని ఆ విధుల నుంచి తప్పించాలి. అలాంటి వారిని బదిలీ చేయాల్సిన అవసరం లేదు.
♦ పదవీ విరమణ తరువాత వివిధ హోదాల్లో తిరిగి నియమించిన, పొడిగింపులపై ఉన్న అధికారులు ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండకూడదు.
♦ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఉన్న అధికారులకు సంబంధించిన బదిలీ ఉత్తర్వులు ఏమైనా ఉంటే సంబంధిత ప్రధాన ఎన్నికల అధికారిని సంప్రదించి ఓటర్ల జాబితా తుది ప్రచురణ తర్వాత మాత్రమే బదిలీలు అమలు చేయాలి. ఏదైనా అసాధారణ కారణాల వల్ల బదిలీ చేయాల్సి వస్తే కేంద్ర ఎన్నికల సంఘం ముందస్తు అనుమతి తీసుకోవాలి. బదిలీలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని సంప్రదించడంతో పాటు బదిలీ ఉత్తర్వులను ఆయనకు ఇవ్వాలి.
♦ ఎన్నికల సంబంధిత అధికారులందరూ ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎవరికీ దగ్గర బంధువు కానని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. క్రిమినల్ కేసుల వివరాలను నిర్ధారించిన నమూనాపత్రంలో సమర్పించాలి. ఏ అధికారి అయినా తప్పుడు సమాచారం ఇస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
ఈనెల 9న రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్ ఈ నెల 9వ తేదీన ఏపీకి రానున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో పాటు ఈవీఎంల సన్నద్ధత, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇతర ఏర్పాట్లపై 9, 10 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్లు సమీక్షిస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షలు నిర్వహించనుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, చెక్‌పోస్టుల ఏర్పాటు, మద్యం, నగదు పంపిణీలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment