సాక్షి, అమరావతి/కడప అర్బన్/గన్నవరం : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని నివాసంలో కలిశారు. తన తనయుడు రాజారెడ్డి వివాహానికి విచ్చేయాలని ఆహ్వానపత్రికను అందజేశారు. తొలి ఆహ్వాన పత్రికను మంగళవారం తన తండ్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన షర్మిల.. ఇడుపులపాయకు రోడ్డు మార్గంలో వెళ్లారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద తనయుడు రాజారెడ్డి వివాహ ఆహ్వానపత్రికను ఉంచి ఆశీస్సులు తీసుకుని, మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్‌లో బస చేశారు.
అందరినీ ఆహ్వానిస్తున్నా..
సీఎం రమేష్ కు చెందిన అదే స్పెషల్ ఫ్లైట్‌లో తనయుడు రాజారెడ్డి, కూతురు అంజలి తదితరులతో కలిసి బుధవారం కడప నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న షర్మిలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షర్మిల అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మనవడు రాజారెడ్డి వివాహానికి అందరినీ ఆహ్వానిస్తున్నానన్నారు.
పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని, అందరూ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం అక్కడికి ముందుగానే ప్యాసింజర్ ఫ్లైట్‌లో చేరుకున్న భర్త అనిల్‌కుమార్‌తో పాటు తనయుడు రాజారెడ్డి, కూతురు అంజలితో కలిసి తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ నివాసానికి చేరుకున్నారు. సుమారు అరగంటపాటు సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
తన తనయుడు రాజారెడ్డి వివాహ ఆహ్వానపత్రికను సీఎం వైఎస్ జగన్‌కు షర్మిల అందజేశారు. అనంతరం తిరిగి గన్నవరం విమానాశ్రయం చేరుకుని, ఎయిర్ ఇండియా విమానంలో భర్తతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. కాగా, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఈ సందర్భంగాప్రకటించారు.
బీటెక్ రవితో అనిల్‌కుమార్ చర్చలు
ప్యాసింజర్ ఫ్లైట్‌లో విజయవాడకు వెళ్లేందుకు షర్మిల భర్త అనిల్ కుమార్ బుధవారం కడప విమానాశ్రయం చేరుకున్నారు. అయితే అప్పటికే టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఆ పార్టీ జమ్మలమడుగు సమన్వయకర్త భూపే‹Ùరెడ్డి తండ్రి దేవగుడి నారాయణరెడ్డి (మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి సోదరుడు)లు కూడా విజయవాడకు వెళ్లేందుకు కడప విమానాశ్రయానికి వచ్చారు. వీరిద్దరితో వీఐపీ లాంజ్‌లో అనిల్‌కుమార్ సమావేశమవ్వడం ఆసక్తికరంగా మారింది. ఫ్లైట్ అరగంటపాటు ఆలస్యం కావడంతో బీటెక్ రవి, నారాయణరెడ్డి, అనిల్‌కుమార్ రాజకీయ పరిస్థితులపై మాట్లాడుకున్నారు.
షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని.. పీసీసీ అధ్యక్ష పదవి తీసుకుంటే.. కడప జిల్లాలో, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయని తనతో అనిల్‌కుమార్ చర్చించినట్లు బీటెక్ రవి మీడియాకు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న షర్మిలకు తన తరఫున శుభాకాంక్షలు చెప్పాలని అనిల్‌కుమార్‌కు చెప్పానని బీటెక్ రవి అన్నారు. ఆ తర్వాత ఒకే ఫ్లైట్‌లో అనిల్‌కుమార్, బీటెక్ రవి, నారాయణరెడ్డిలు విజయవాడ చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment