ఆరుగురు గంజాయి విక్రేతల అరెస్ట్
రాయచోటి టౌన్ : రాయచోటిలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని అర్బన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. స్థానిక అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ సోమవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాయచోటి పట్టణంలోని నాయిబ్ సాహెబ్ వీధికి చెందిన షేక్ జమాల్ బాషా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో నిఘా పెట్టామన్నారు. జమాల్ బాషాను అదుపులోకి తీసుకొని అతని నుంచి 1200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అతని సమాచారంతో బండ్లపెంట వద్ద దివానాసాబ్ దర్గా దగ్గర తిరుగుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిలో అదే వీధికి చెందిన షేక్ మహబూబ్ జాన్, షేక్ అమ్మాజీ, షేక్ ఫకృన్నిసాతోపాటు అనంతపురానికి చెందిన రహమత్‌జాన్, షేక్ సోను ఉన్నారని తెలిపారు. వీరిలో మహబూబ్ జాన్, రహమ్మత్ జాన్‌లు కాకినాడ, సామర్లకోట నుంచి కిలో రూ.1300తో తీసుకొచ్చి ఇక్కడ రూ.1500తో అమ్ముతుంటారని పేర్కొన్నారు. చిన్న ప్యాక్‌లుగా తయారు చేసి, పట్టణంలోనే కాకుండా ఇతర ప్రాంతాల వారికి అమ్ముతుంటారన్నారు. వీరిని పట్టుకోవడానికి అర్బన్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐలు నరసింహారెడ్డి, అబ్దుల్ జహీర్, సిబ్బంది రామచంద్ర, బర్కతుల్లా, మహేంద్రనాయుడు, పెంచలయ్య, మహేంద్ర, అనాలసిస్ ఇన్‌చార్జి రవి, ఇతర సిబ్బంది చాకచక్యంగా పని చేశారని పేర్కొన్నారు. వీరిని అభినందిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment