మా బిడ్డలకు ఏదీ రక్షణ?
పెద్దతిప్పసముద్రం : ‘మా బిడ్డలకు ఏదీ రక్షణ?’ అంటూ విద్యార్థినుల తల్లిదండ్రులు కస్తూర్బా విద్యాలయం బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర శిక్షా, పీఎం పోషణ్ సామాజిక తనిఖీ బృందం 2024 జూన్ నుంచి డిసెంబర్ వరకు సంబంధించి గత కొన్ని రోజులుగా ప్రభుత్వ, రెసిడెన్సియల్ స్కూళ్లను తనిఖీ చేస్తోంది. ఈ క్రమంలో ఎస్సార్పీ సుబ్బారావు, డీఆర్పీలు నాగిరెడ్డి, భగవాన్, మల్లేష్‌లు చేపట్టిన తనిఖీలో ఎన్నో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదివారం స్థానిక కస్తూర్బా బాలికా విద్యాలయంలో ఆడిట్ బృందం పిల్లల కన్నవాళ్లతో గ్రామసభ నిర్వహించి వాస్తవాలు బహిర్గతం చేసింది. ‘ఏడవ తరగతి చదివే బాలికను బయటి వ్యక్తుల వెంట పంపడంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు, కన్నవాళ్ల అనుమతి లేకుండా మీ పిల్లలను వేరే వాళ్లతో ఇలాగే పంపుతారా, ఆచూకీ తెలిసింది కాబట్టి సరిపోయింది, మా బిడ్డలు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు’ అని ఎస్వో శైలజాను విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఎస్వోతోపాటు ఆమె కుటుంబ సభ్యుల దుస్తులన్నీ బాలికలే ఉతికి ఆరేస్తున్నారని, పిల్లలతో వేకువజామునే చపాతీల పిండి రుద్దిస్తున్నారని, వంట పనులకు వాడుకుంటున్నారని, పనులు చేయని వారిని పత్రికల్లో రాయలేని విధంగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, కుల వివక్ష చూపుతున్నారని, ప్రత్యేక స్టోర్ రూం లేకపోవడంతో రాత్రి వేళ నిత్యావసర సరుకులు మాయం అవుతున్నాయని వారు వెల్లడించారు. భోజన విషయానికొస్తే అన్నంలో తల వెంట్రుకలు, పురుగుల అన్నం, నీళ్ల సాంబారు, పగలు మిగిలిన కూర రాత్రి పూట వడ్డించడం, గతంలో వండిన రసంలో బల్లి పడటం, మెనూ పాటించక పోవడం తదితరాలతో బాలికలు అర్ధాకలితో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మౌలిక సౌకర్యాల గురించి ఆరా తీస్తే.. 231 మంది బాలికలు ఉన్న ఈ స్కూల్‌కు సీసీ కెమెరాలు ఉన్నా పని చేయవు, పూర్తి స్థాయిలో ఫ్యాన్లు తిరగవు, మినరల్ ఆర్వోఆర్ ప్లాంట్ ఉన్నా అది అలంకారమే, తద్వారా బోరు నీళ్లే దిక్కు, మరుగుదొడ్లకు తలుపులు ఉన్నా గడియలు లేవని వాపోయారు. నిబంధనల విషయానికొస్తే.. ఎస్వో భర్త ఎప్పుడుపడితే అప్పుడు స్కూల్‌లోకి వచ్చి పుష్టిగా భోజనం ఆరగించి అక్కడే ఉండటం, అస్తవ్యస్తంగా రిజిస్టర్ల నిర్వహణ, పేరెంట్స్ కమిటీ మీటింగ్ సక్రమంగా నిర్వహించకపోవడం, వాడేసిన న్యాప్‌కిన్స్ మిషన్‌లో బర్నింగ్ చేయాల్సి ఉన్నా యంత్రాన్ని వాడకుండా బయట పడేయడం, స్కూల్‌కు రాని పిల్లలు కూడా హాజరైనట్లు రిజిస్టర్‌లో నమోదు, పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం వంటి వాటితో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు వివరించారు. ఈ వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆడిట్ బృందం పేర్కొంది.
మీ పిల్లలను వేరే వాళ్లతో
ఇలాగే బయటికి పంపుతారా?
ఎస్వోను ప్రశ్నించిన విద్యార్థినుల కన్నవాళ్లు
కస్తూర్బా విద్యాలయంలో
పని చేయని సీసీ కెమెరాలు
బాలికలచే వెట్టి చాకిరి
ఆడిట్ బృందం తనిఖీలో విస్తుపోయే నిజాలు
68 స్కూళ్లు తనిఖీ
జిల్లా వ్యాప్తంగా తమ బృందం 68 స్కూళ్లను తనిఖీ చేయాల్సి ఉండగా ఇప్పటికి 7 స్కూళ్లు పూర్తి చేశాం. మొదటగా మౌలిక వసతులు, తరగతుల వారీగా పిల్లలతో విడివిడిగా అభిప్రాయాలు, మెనూ, ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కన్నవాళ్లతో గ్రామసభ నిర్వహించి వాస్తవాలు వెల్లడిస్తాం. మా దృష్టికి వచ్చిన ఫిర్యాదులు, సరుకుల్లో వ్యత్యాసాల వివరాలను సమగ్రంగా విద్యాశాఖ ఎస్పీడీ కార్యాలయం, జిల్లా కలెక్టర్‌కు అందజేస్తాం.
– సుబ్బారావు, స్టేట్ రిసోర్స్ పర్సన్
Comments
Please login to add a commentAdd a comment