అయ్యో పాపం
నిమ్మనపల్లె : ముక్కుపచ్చలారని చిన్నారిని ట్రాక్టర్ దూసుకు వచ్చి ఢీకొనడంతో దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పసిబిడ్డ కళ్లముందే మృతి చెందడంతో కన్న పేగు తల్లడిల్లిపోయింది.
అప్పుడే నూరేళ్లు నిండిపోయాయ అని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కొండయ్యగారిపల్లెకు చెందిన ఉప్పుతోళ్ల పవిత్ర, సురేష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు యక్షిత (5), చిన్న కుమార్తె గానవి (2) ఉన్నారు. అదే గ్రామానికి చెందిన పి.రెడ్డిఖాన్ కుమారుడు పి.రెడ్డిబాషా (34) ట్రాక్టర్‌తో ఓ రైతుకు చెందిన పొలం దుక్కి దున్ని తిరిగి ఇంటికి వస్తున్నాడు. గ్రామంలోని రాగ వీధిలో ఆడుకుంటున్న చిన్నారి గానవి పైకి ఆ ట్రాక్టర్ వేగంగా దూసుకుపోయి ఢీకొంది. చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన చికిత్స నిమిత్తం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో పరిస్థితి విషమించి మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్సై తిప్పేస్వామి సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా, ట్రాక్టర్ నడిపి చిన్నారి మృతికి కారణమైన రెడ్డి బాషాపై చిన్నారి తండ్రి సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
● ట్రాక్టర్ ఢీకొని చిన్నారి దుర్మరణం
● కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు
Comments
Please login to add a commentAdd a comment