బ్రిడ్జిపై నుంచి కారు పల్టీ
బి.కొత్తకోట : వేగంగా వెళ్తున్న కారు చెరువు బ్రిడ్డిపై నుంచి కిందికి దూసుకెళ్లి పల్టీ కొట్టిన ఘటన ఆదివారం మండలంలోని బుచ్చిరెడ్డిగారిపల్లె సమీపంలోని గుమ్మసముద్రం చెరువు మొరవ వద్ద జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రాలేదు. కారు అతివేగంగా బి.కొత్తకోట నుంచి మదనపల్లె వైపు వెళ్తూ గుమ్మసముద్రం మొదటి మొరవ వద్ద అదుపుతప్పి ఎడమవైపు ఉన్న మొరవలోకి వెళ్లి బండపై పడినట్లు తెలుస్తోంది. ముందు భాగం ధ్వంసం కాగా కారు పైకి నిలబడింది. ఇందులో ఎంత మంది ప్రయాణిస్తున్నారు, వారికి గాయాలయ్యాయా లేదా అనే సమాచారం కూడా లేదు. పోలీసులు ఆరా తీసినా వివరాలు లభ్యం కాలేదు.
చైన్ స్నాచింగ్
కలికిరి : పొలం వద్ద పనులు చేసుకుంటున్న వృద్ధురాలు మెడలో గుర్తుతెలియని వ్యక్తులు బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన ఆదివారం కలికిరి మండలం పారపట్ల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పారపట్ల గ్రామం కురవపల్లికి చెందిన కంభం భార్య ఆనందమ్మ పొలం పనులు చేసుకుంటుండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చారు. వారిలో ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి కూరగాయలు కావాలని అంటూ మాటల్లో దింపి, మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లాడు. ద్విచక్రవాహనం వద్ద వున్న ఇద్దరు వ్యక్తులతో కలిసి సమీపంలోని గుండ్లూరు–వాల్మీకిపురం రోడ్డులో గుండ్లూరు వైపు వెళ్లారు. దీంతో వృద్ధురాలు పెద్దగా కేకలు వేసింది. సమీపంలోని గ్రామంలోకి వెళ్లి జరిగిన ఘటనను తెలియజేసి, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
టీడీపీ నేతపై కేసు నమోదు
రాజంపేట : పుల్లంపేట మండలం రామక్కపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు సుబ్రమణ్యంనాయుడుపై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు బాధిత విలేకరి కూరాకు శ్రీను ఆదివారం ఇక్కడి విలేకర్లకు తెలిపారు. ఎస్‌ఐ మోహన్‌కుమార్ గౌడ్ కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ దృష్టికి విలేకరిని బెదిరించిన సంఘటన వెళ్లిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment