వైఎస్సార్‌జిల్లా (రాజంపేట టౌన్) : రాజంపేట పట్టణంలోని జానీబాషాపురం గ్రామం ఏర్పడటానికి ఓ ఆసక్తికరమైన వాస్తవిక నేపథ్యంవుంది. జానీబాషాపురం గ్రామ ప్రజల కథనం మేరకు వివరాలిలావున్నాయి. దాదాపు ఎనిమిది దశాబ్దాల క్రితం ప్రస్తుతం ఉన్న జానీబాషాపురం ప్రాంతానికి తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన జానీమియా అలియాస్ జానీబాషాసాహెబ్ వచ్చాడు.
తనకు తెలిసిన మంత్రాలు, నాటు వైద్యంతో జీవనం సాగించేవాడు. అయితే అప్పట్లో ఆ ప్రాంత ప్రజలు అత్యంత నిరుపేదలు కావడంతో జానీబాషాసాహెబ్ తన సంపాదనను ఖర్చు చేసి వారి కడుపునింపేవారు. అలాగే అక్కడి ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఉచితంగా వైద్యం చేసి వారి ఆరోగ్య సమస్యలను నయం చేసేవారు.
ఈనేపథ్యంలో జానీబాషాపురం గ్రామానికి ప్రక్కనే ఉన్న తుమ్మల అగ్రహారంకు చెందిన షడదర్శనం సుబ్బయ్యశాస్త్రి, జానీబాషాసాహెబ్ మధ్య చక్కటి స్నేహం కుదిరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి షడదర్శనం సుబ్బయ్యశాస్త్రి కుమార్తె లక్ష్మీదేవి అనారోగ్యం భారీనపడటంతో సుబ్బయ్యశాస్త్రి ఆరోజుల్లోనే తన కుమార్తెకు పెద్దనగరాల్లో వైద్యం చేయించాడు. అయితే ఆమె ఆరోగ్యం కుదుటుపడలేదు. దీంతో సుబ్బయ్యశాస్త్రి జానీబాషాసాహెబ్‌కు తన కుమార్తె ఆరోగ్య పరిస్థితి గురించి తెలియచేసి వైద్యం అందించాల్సిందిగా కోరాడు. కుమార్తె ఆరోగ్యం కుదుటుపడితే తనకున్న భూమిలో కొంత ఇస్తానని జానీబాషాసాహెబ్‌కు చెప్పాడు.
తనకు ఎలాంటి ప్రతిఫలం వద్దని నీకుమార్తె ఆరోగ్యం బాగుచేస్తానని సుబ్బయ్యశాస్త్రికి జానీబాషాసాహెబ్ మాటిచ్చాడు. జానీబాషాసాహెబ్ తనవైద్యంతో ఆమె ఆరోగ్యం కుదుటుపరిచాడు. సుబ్బయ్యశాస్త్రి ఇచ్చినమాట ప్రకారం 1943వ సంవత్సరంలో 3.2 ఎకరాల భూమిని జానీబాషాసాహెబ్ పేరిట రాసి ఇచ్చాడు. జానీబాషాసాహెబ్ ఆ భూమిని అక్కడున్న ప్రజలందరికి ఉచితంగా పంపిణీ చేశాడు.
ఆ సలాన్ని ఎవరు కూడా విక్రయించకుండా వారు, వారి వారసులు మాత్రమే అనుభవించేలా రాతపూర్వకంగా రాయించాడు. దీంతో అక్కడి ప్రజలకు ఆయన దేవుడయ్యాడు. ఇందువల్లే ప్రతి ఏడాది జానీబాషాసాహెబ్ పేరిట ఉరుసు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాక తమ గ్రామానికి జానీబాషాసాహెబ్ అని నామకరణం చేశారు. కాలక్రమేనా ఆ గ్రామం జానీబాషాపురంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment