సంక్షేమ ఫలాలు అర్హులకు అందేలా చూడాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ ఫలాలు అర్హులకు అందేలా చూడాలి

Published Sun, Oct 20 2024 3:28 AM | Last Updated on Sun, Oct 20 2024 3:28 AM

సంక్షేమ ఫలాలు అర్హులకు అందేలా చూడాలి

బాపట్ల:కేంద్రం నిధులతో అమలయ్యే సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి నిరుపేదకు అందించాలని పార్లమెంట్‌ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్‌ అధికారులకు సూచించారు. జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం (దిశ) శనివారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. కమిటీ చైర్మన్‌గా పార్లమెంట్‌ అధ్యక్షులు కృష్ణప్రసాద్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వికసిత్‌ భారత్‌–2047 లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయన్నారు. నిధులు పెండింగ్‌లో ఉంటే స్పష్టమైన నివేదిక ఇవ్వాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. అర్హులైన ఎస్టీలందరికీ జాబ్‌ కార్డులు జారీ చేసి, ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించాలని తెలిపారు. యువతలో నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన ఇళ్ల నిర్మాణంపై సమగ్ర వివరాలు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. జల జీవన్‌ మిషన్‌ కింద రూ.578 కోట్ల నిధులు మంజూరు కాగా 40 శాతానికి మించి పనులు చేయకపోవడంపై ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఎంపీ నిలదీశారు. పనులు చేసినప్పటికీ నిధులు విడుదల కాలేదని అధికారులు ఎంపీ దృష్టికి తెచ్చారు. తక్షణమే నివేదిక ఇవ్వాలని చెప్పారు. బాపట్లలో ఈఎస్‌ఐ హాస్పిటల్‌ ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. 17వ లోక్‌సభ నిధుల మంజూరు, వినియోగంపై అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించాలన్నారు. గతంలో ఎంపీ ల్యాడ్స్‌ నిధుల వినియోగంపై విజిలెన్స్‌ విచారణ చేయిస్తామన్నారు. కలెక్టర్‌ జె.వెంకటమురళి మాట్లాడుతూ గ్రామాలలో సుస్థిర ఆస్తులు సమకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులను ఖర్చు చేస్తుందని తెలిపారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పథకంలో సమగ్ర విచారణ చేసి అర్హులకు మాత్రమే పింఛన్‌ అందించాలని కోరారు. జిల్లా అధికారి సీహెచ్‌ సత్తిబాబు, ప్రకాశం జెడ్పీ సీఈవో చిరంజీవి, గుంటూరు జెడ్పీ సీఈవో జ్యోతిబసు, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎంపీ ల్యాడ్స్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ప్రారంభం

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌ అన్నారు. కలెక్టరేట్‌ ఆవరణలో రూ.ఐదు లక్షల నిధులతో ఏర్పాటుచేసిన ఎంపీ ల్యాడ్స్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను ఎంపీ శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జె వెంకటమురళి, జిల్లా సంయుక్త కలెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, సీపీఓ శ్రీనివాసులు, ఆర్డీఓ పి గ్లోరియా తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement