
న్యూఢిల్లీ: ఎగుమతుల రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి రంగాల వారీ వ్యూహాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్– బెంగళూరు (ఐఐపీఎంబీ)డైరెక్టర్ రాకేష్ మోహన్ జోషి పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇతర హైటెక్ పరిశ్రమల కోసం ఈ తరహా వ్యూహం అవసరమని పేర్కొన్నారు. భారత్ 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల వస్తు, సేవల ఎగుమతుల లక్ష్యాన్ని చేరడానికి ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు వార్షిక వృద్ధి రేటు 14.5 శాతంగా నమోదుకావాలనీ అంచనావేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
► పాలిష్ చేసిన వజ్రాలు, ఆభరణాలు, ప్యాసింజర్ కార్లు, టెలికమ్యూనికేషన్ పరికరాలు వంటి రంగాలు ఎగుమతుల భారీ పెరుగుదలలో దోహదపడతాయి.
► దేశాల పరంగా చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), హాంకాంగ్, జర్మనీ, వియత్నాం, బ్రిటన్, ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఇటలీ, థాయ్‌లాండ్, టర్కీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, బెల్జియంలకు మన ఎగుమతులను పెంచుకోడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.
► ఎగుమతిదారులు, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమాచార, సమన్వయ అంతరాన్ని తగ్గించడం ప్రస్తుతం అవసరం. రియల్ టైమ్ సమాచారాన్ని సేకరించడం, సమీకరించడం, ప్రాసెసింగ్ చేయడం, సంబంధిత వ్యక్తులకు ఆ సమాచారాన్ని సకాలంలో అందేలా చేయడం, ఆధునిక సాంకేతికతను అవలంబించడం చాలా ముఖ్యమైన అంశాలు.
► అమెరికా, యూరోపియన్ యూనియన్ తదితర అభివృద్ధి చెందిన దేశాలలో సెమీకండక్టర్ తయారీని సులభతరం చేయడానికి చిప్స్ చట్టం వంటి రక్షణవాద విధానాల పునరుద్ధరణను భారతదేశం నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
► పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
► వ్యవసాయం, తోటల పెంపకం, ఉద్యానవన అనుబంధ రంగాల పురోగతికి ఐఐపీఎంబీ కీలక సహకారాన్ని అందిస్తోంది. విద్య, ఎగుమతులు, సామర్థ్యం పెంపుదల, శిక్షణ, విధాన పరిశోధన, అభివృద్ధి వంటి వివిధ కోణాల్లో పురోగతికి వ్యూహాలు రూపొందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment