ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెప్టెంబర్) అభ్యంతరకర ప్రకటనలు అత్యధికంగా డిజిటల్ మీడియాలోనే దర్శనమిచ్చాయని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ (ఏఎస్‌సీఐ) ఒక నివేదికలో తెలిపింది. అయిదింట నాలుగొంతుల అభ్యంతర యాడ్‌లు డిజిటల్ మీడియా నుంచే ఉన్నట్లు వివరించింది.
గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే 2023–24 ప్రథమార్ధంలో ఏఎస్‌సీఐ 27 శాతం అధికంగా 3,501 ప్రకటనలను సమీక్షించింది. సమీక్షాకాలంలో ఫిర్యాదుల సంఖ్య 34 శాతం పెరిగి 4,491కి చేరింది. ఏఎస్‌సీఐ ప్రాసెస్ చేసిన ప్రకటనల్లో ఇన్‌ఫ్లుయెన్సర్ల కేసులు 22 శాతం ఉన్నాయి. ఎనిమిది ఉల్లంఘనలతో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
రంగాల వారీగా చూస్తే .. అత్యధికంగా హెల్త్‌కేర్‌లో, ఆ తర్వాత సంప్రదాయ విద్య, వ్యక్తిగత సంరక్షణ, గేమింగ్ విభాగాల్లో ఉల్లంఘనలు జరిగాయి. నాలుగింట మూడొంతుల ఫిర్యాదులను ఏఎస్‌సీఐ సుమోటోగా చేపట్టగా, వినియోగదారుల నుంచి వచ్చినవి 21 శాతం ఉన్నాయి. ఉల్లంఘనల్లో వాటాలు చూస్తే డిజిటల్ మీడియా 79 శాతం, ప్రింట్ మాధ్యమం 17 శాతం, టీవీ మాధ్యమం 3 శాతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment