రేమండ్ రియల్టీ ఏర్పాటు
1:1 ప్రాతిపదికన షేర్ల జారీ
న్యూఢిల్లీ: రియల్టీ బిజినెస్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీయనున్నట్లు టెక్స్‌టైల్స్ దిగ్గజం రేమండ్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఇందుకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. రేమండ్ రియల్టీ పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో వాటాదారులకు మరింత విలువ చేకూరనున్నట్లు తెలియజేసింది.
తద్వారా భారీ వృద్ధికి వీలున్న దేశీ ప్రాపర్టీ మార్కెట్లో మరింత పురోగతిని సాధించవచ్చని తెలియజేసింది. విడదీత పథకంలో భాగంగా వాటాదారులకు 1:1 ప్రాతిపదికన షేర్లను జారీ చేయనుంది. అంటే రేమండ్ లిమిటెడ్ వాటాదారులకు ప్రతీ షేరుకి 1 రేమండ్ రియల్టీ షేరుని కేటాయించనుంది. వాటాదారులు, రుణదాతలు, ఎన్‌సీఎల్‌టీ తదితర నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి రేమండ్ రియల్టీ లిమిటెడ్‌కు తెరతీయనున్నట్లు రేమండ్ వివరించింది.
24 శాతం వాటా
రేమండ్ లిమిటెడ్ మొత్తం ఆదాయంలో రియల్టీ బిజినెస్ 24 శాతం వాటాను ఆక్రమిస్తోంది. 2023–24లో విడిగా 43 శాతం వృద్ధితో రూ. 1,593 కోట్ల టర్నోవర్ సాధించింది. విడదీతలో భాగంగా రేమండ్ లిమిటెడ్ వాటాదారులకు రేమండ్ రియల్టీ 6,65,73,731 ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో రేమండ్ రియల్టీ లిస్ట్‌కానుంది.
అనుబంధ సంస్థలుసహా కంపెనీ నిర్వహిస్తున్న రియల్టీ బిజినెస్‌ను పునర్వ్యవస్థీకరించే బాటలో తాజా పథకానికి తెరతీసినట్లు రేమండ్ లిమిటెడ్ వెల్లడించింది. విడదీత ద్వారా రియలీ్టలో భారీ వృద్ధి అవకాశాలను అందుకోవడం, కొత్త ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడం, వ్యూహాత్మక భాగస్వాములను చేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేసింది. మొత్తం రియల్టీ బిజినెస్‌ను ఒకే కంపెనీ నిర్వహణలోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. గతేడాది రియల్టీ విభాగం రూ. 370 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది.
రియల్టీ తీరిలా
రేమండ్ రియల్టీ థానేలో 100 ఎకరాల భూమిని కలిగి ఉంది. 40 ఎకరాలు అభివృద్ధి దశలో ఉంది. ఇక్కడ రూ. 9,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. రూ. 16,000 కోట్లకుపైగా అదనపు ఆదాయానికి వీలుంది. వెరసి థానే ల్యాండ్ బ్యాంక్ ద్వారా రూ. 25,000 కోట్ల ఆదాయానికి అవకాశముంది. ఇటీవల అసెట్‌లైట్ పద్ధతిలో ముంబై, బాంద్రాలో భాగస్వామ్య అభివృద్ధి(జేడీఏ) ప్రాజెక్టుకు తెరతీసింది. అంతేకాకుండా మహీమ్, సియోన్, బాంద్రాలలో మరో మూడు జేడీఏలకు సంతకాలు చేసింది. ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా రూ. 7,000 కోట్ల టర్నోవర్‌కు వీలుంది.
విడదీత వార్తల నేపథ్యంలో రేమండ్ షేరు బీఎస్‌ఈలో 0.7 శాతం నీరసించి రూ. 2,942 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment