న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర నష్టం దాదాపు సగానికి తగ్గి రూ. 446 కోట్లకు పరిమితమైంది. వ్యయాలు తగ్గడం ఇందుకు సహకరించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 830 కోట్ల నికర నష్టం నమోదైంది. అయితే మొత్తం ఆదాయం రూ. 2,102 కోట్ల నుంచి రూ. 1,726 కోట్లకు క్షీణించింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 2,935 కోట్ల నుంచి రూ. 2,175 కోట్లకు తగ్గాయి.
విమానాలు అద్దెకిచ్చే క్యాజిల్ లేక్‌తో ఉన్న వివాదాలను సర్దుబాటు చేసుకోవడంతోపాటు.. సిటీ యూనియన్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ. 100 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా కార్లయిల్ ఏవియేషన్ పార్ట్‌నర్స్‌కు షేరుకి రూ. 48 ధరలో 4.81 కోట్ల షేర్లను జారీ చేసినట్లు పేర్కొంది. రుణాలను ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా రూ. 230 కోట్ల రుణాలు తగ్గించుకున్నట్లు తెలియజేసింది.
నిధుల సమీకరణకు రెడీ
ఆర్థిక సంస్థలు, ఎఫ్‌ఐఐలకు ఈక్విటీ షేర్ల జారీ ద్వారా 27 కోట్ల డాలర్లు(రూ. 2,250 కోట్లు) సమీకరించనున్నట్లు స్పైస్‌జెట్ పేర్కొంది. తద్వారా ఆర్థిక సవాళ్లకు చెక్ పెట్టే యోచనలో ఉంది. ప్రయివేట్ ప్లేస్‌మెంట్‌లో భాగంగా ఈక్విటీ షేర్లు, వారంట్ల జారీకి బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది.
ఎలారా ఇండియా అపార్చునిటీస్ ఫండ్, ఏరీస్ అపార్చునిటీస్ ఫండ్, నెక్సస్ గ్లోబల్ ఫండ్, ప్రభుదాస్ లీలాధర్ తదితరాలకు సెక్యూరిటీలను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీ ఎన్‌ఎస్‌ఈలోనూ లిస్టయ్యే ప్రణాళికల్లో ఉన్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment