దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం భారీగా పడిపోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 1379 పాయింట్లు పడిపోయి 21,884 వద్దకు చేరింది. సెన్సెక్స్ 4389 పాయింట్లు దిగజారి 72,079 వద్ద ముగిసింది. చరిత్రలో ఎప్పడూలేని విధంగా మార్కెట్‌సమయంలో నిఫ్టీ దాదాపు ఒక్కరోజులో 8శాతం మేర తగ్గింది. చివరకు 5.92 శాతం నష్టంతో ముగిసింది. ఈ ఒక్కరోజు మదుపర్ల సంపద రూ.30లక్షల కోట్లు ఆవిరైంది.
సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌యూఎల్, నెస్లే మినహా అన్ని స్టాక్‌లు నష్లాల్లో ముగిశాయి. భారీగా నష్టపోయిన స్టాక్‌ల్లో ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఎల్ అండ్ టీ, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీఎయిర్‌టెల్ స్లాక్‌లున్నాయి.
అదానీ స్టాక్స్‌లో అమ్మకాలు..
ఎన్‌డీఏ కూటమికి అంచనాల ప్రకారం ఆధిక్యత రావడంలేదని మార్కెట్ వర్గాలు భావించాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 350 స్థానాలకు పైగా గెలుచుకుంటుందని.. 150 సీట్లకు కాస్త అటూఇటూగా ఇండియా కూటమి పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా కనిపిస్తున్నాయి. దాంతో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 19.80 శాతం, అదానీ పవర్ షేర్లు 19.76 శాతం, అంబుజా సిమెంట్స్ 19.20 శాతం పతనమయ్యాయి. అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 19.13 శాతం పడిపోయాయి.
అంచనాలు తలకిందులు..
స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే మార్కెట్లు పుంజుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకు భిన్నంగా ఫలితాలు వెలువడితే మాత్రం సూచీలు మరింత దిగజారే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. తిరిగి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రభుత్వరంగ సంస్థల్లో తీసుకున్న నిర్ణయాల్లో భారీ మార్పులు చేయవచ్చనే వాదనలున్నాయి. మరోవైపు అంచనాలకు భిన్నంగా ఇండియా కూటమి పుంజుకోవడంతో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మదుపర్ల అంచనాలు తప్పాయి.
ఇప్పుడేం చేయాలి..
మార్కెట్‌లు ఇంతలాపడుతుంటే కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నవారు కంగారుపడిపోకుండా దీన్నో అవకాశంగా చూడాలని నిపుణులు చెబుతున్నారు. ఫండమెంటల్స్ బలంగా ఉన్న స్టాక్స్‌లో పెట్టుబడిపెట్టిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఇలా మార్కెట్ పడిపోతున్న సమయంలో మరిన్ని స్టాక్‌లు కొనుగోలు చేయాలంటున్నారు. గతంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఆరు నెలల వ్యవధిలో మార్కెట్‌లు పడిపోయిన దానికంటే చాలా పాయింట్లు పెరిగినట్లు రుజువైంది. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందకుండా మంచి కంపెనీల్లో పెట్టుబడి పెట్టినవారు కొంతసమయం వేచిచూస్తే లాభాలు పొందవచ్చని చెబుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment