దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 117 పాయింట్లు లాభపడి 23,435కు చేరింది. సెన్సెక్స్ 370 పాయింట్లు ఎగబాకి 76,984 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 104.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.3 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.85 శాతం, నాస్‌డాక్ 1.53 శాతం లాభాల్లోకి చేరాయి.
డిపాజిట్ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, మధ్య కాలికంగా తగ్గే అవకాశం ఉందని ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా విశ్లేషించారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తే..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం నుంచి ఆర్‌బీఐ కూడా తన వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్నారు.
స్విట్జర్లాండ్, స్వీడన్, కెనడా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్ బ్యాంకులు 2024లో తమ రేటు సడలింపు ప్రక్రియను ప్రారంభించాయి. అయితే, ద్రవ్యోల్బణం నిలకడగా ఉంటున్న నేపథ్యంలో అమెరికా సెంట్రర్ బ్యాంక్ ఫెడ్ వడ్డీరేట్ల పెంపుపై వెనక్కి తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా, బుధవారం రాత్రి విడుదలైన ఫెడ్ మీటింగ్‌లో వడ్డీ రేట్లను (5.25%–5.5%) యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈఏడాదిలో చివరివరకు కనీసం రెండుసార్లు వడ్డీరేట్లు తగ్గుతాయని మార్కెట్ వర్గాలు ఆశించాయి. కానీ అందుకు భిన్నంగా కేవలం ఒకేసారి వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉండబోతుందని ఫెడ్ మీటింగ్ సూచిస్తుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment