న్యూఢిల్లీ: యూజర్ల వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం ట్విటర్‌లాగా చార్జీలేమి విధించబోమని, ఇది పూర్తిగా ఉచితమేనని దేశీ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అప్రమేయ రాధాకృష్ణ చెప్పారు. ఆధార్ ఆధారిత స్వీయ ధృవీకరణతో పసుపు రంగు వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ని ఉచితంగా పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. బాట్స్ (రోబో) సమస్యను సృష్టించినది ట్విటరే అని రాధాకృష్ణ ఆరోపించారు. మొదట్లో వాటిని ప్రోత్సహించిన ట్విటర్ ప్రస్తుతం నియంత్రించడానికి నానా తంటాలు పడుతోందని చెప్పారు.
తాము సిసలమైన మనుషులమేనని యూజర్లు ధృవీకరించేందుకు, బ్లూ టిక్ పొందేందుకు .. వెరిఫికేషన్ పేరిట చార్జీలు వసూలు చేసే ప్రయత్నాల్లో ఉందని విమర్శించారు. కూ ఈ ఏడాది తొలి నాళ్ల నుండే స్వచ్ఛంద వెరిఫికేషన్‌ను యూజర్లకు చట్టబద్ధమైన హక్కుగా ఉచితంగా అందిస్తోందని రాధాకృష్ణ తెలిపారు. ఇప్పటివరకూ 1,25,000 మంది భారతీయ యూజర్లు దీన్ని ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత పలు మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. భారీగా ఉద్యోగులను తొలగించడంతో పాటు వెరిఫైడ్ బ్యాడ్జ్‌ల కోసం 8 డాలర్ల ఫీజు విధించనుండటం మొదలైనవి వీటిలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment