గుడిపాల ఎస్‌ఐకు అవార్డు | - | Sakshi
Sakshi News home page

గుడిపాల ఎస్‌ఐకు అవార్డు

Published Sat, Sep 7 2024 2:52 AM | Last Updated on Sat, Sep 7 2024 2:52 AM

గుడిప

గుడిపాల: వివిధ కేసులను ఛేదించడంతో చూపిన ప్రతిభకు గుడిపాల ఎస్‌ఐ రామ్మోహన్‌ అవార్డు అందుకున్నారు. శుక్రవారం చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ఆయనకు డీజీపీ కామెండేషన్‌ డిస్క్‌ బ్రాంజ్‌ మెడల్‌ అవార్డ్‌తో పాటు సేవాపత్రం అందజేశారు. 2022లో బి.కొత్తకోట ఎస్‌ఐగా పనిచేస్తున్నప్పుడు సుమారుగా రూ.2 కోట్ల విలువైన కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే 20 దొంగతనం కేసులను ఛేదించి సొత్తు రికవరీ చేశారు. రెండు హత్య కేసుల్లో ఎలాంటి క్లూ లభించకున్నా ఛేదించడం, అలాగే బి. కొత్తకోట మండలంలో వర్షాల ఉధృతికి ఓ కారులో కొట్టుకుపోతున్న ఒక కుటుంబాన్ని ప్రాణాలకు తెగించి కాపాడినందుకు, ఫిర్యాదులపై స్పందించి సత్వర న్యాయం చేసినందుకు 2022వ సంవత్సరానికి గాను ఈ అవార్డు ఆయనకు ప్రదానం చేశారు.

శిలాఫలకాలు కనబడకుండా పెయింటింగ్‌

టీడీపీ నాయకుడు చేశాడనివైఎస్సార్‌సీపీ నేతల ఆరోపణ

గంగవరం: మండలంలోని గంగవరం పంచాయతీ మారేడుపల్లె గ్రామ సచివాలయం శిలాఫలకాలకు పెయింటింగ్‌ వేసి కనబడకుండా చేసిన ఉదంతం శుక్రవారం వెలుగుచూసింది. వివరాలు..గత ప్రభుత్వ హయాంలో సచివాలయాల నిర్మాణాలు పూర్తయిన తరువాత ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యే, నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న వారి పేర్లతో శిలాఫలకాలను సచివాలయాల వద్ద ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుత అధికార పార్టీ నాయకులు మారేడుపల్లెలో ఆ శిలాఫలకాలు పూర్తిగా కనిపించకుండా పెయింట్‌ వేశారు. దీనిపై పంచాయతీ వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. పంచాయతీ టీడీపీ జనరల్‌ కార్యదర్శి బాలాజీ ఈపని చేశారని ఆరోపించారు. దీనిపై సోమవారం ఎంపీడీఓ, జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయంలో మండల నాయకులతో కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు.

వైద్యానికి ఎమ్మెల్యే సాయం

చౌడేపల్లె: మండలంలోని పెద్దకొండామర్రి పంచాయతీ కోటూరుకు చెందిన షాహెదాకు పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం ఆర్థిక సాయం చేశారు. నాలుగు రోజుల క్రితం కరెంటు షాక్‌కు ఆమె గురైంది. సర్పంచ్‌ జయసుధమ్మ, ఎంపీటీసీ షాహీనా మంత్రి దృష్టికి దీనిని తీసుకెళ్లారు. స్పందించిన ఆయన మంత్రి షాహెదా వైద్యం కోసం ఇచ్చిన రూ.10 వేలను సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పార్టీనేతలు కలిసి బాధితురాలికి అందజేశారు. కార్యక్రమంలో నేతలు నాగభూషణరెడ్డి, రవి కుమార్‌రెడ్డి, ఓబులేసు, హస్సేన్‌, రాంబాబు, మునిగిరి బాబురెడ్డి, రబ్బాని, మహబూబ్‌బాషా, అహమ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి 8 గంటలు

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణం ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి వరకు 61,142 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,525 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.20 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే, దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో,ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్ల భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
గుడిపాల ఎస్‌ఐకు అవార్డు 
1
1/2

గుడిపాల ఎస్‌ఐకు అవార్డు

గుడిపాల ఎస్‌ఐకు అవార్డు 
2
2/2

గుడిపాల ఎస్‌ఐకు అవార్డు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement