కొదమసింహాలై గర్జించాలి
పలమనేరు/ గంగవరం: ఎన్నికలెప్పుడొచ్చినా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కొదమసింహాలై గర్జించి, మళ్లీ వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేసి, జగనన్నను సీఎం చేసుకుందామని ఆ పార్టీ చిత్తూరు,తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూ మన కురుణాకరరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పలమనేరు సమీపంలోని సాయినగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్‌లో స్థానిక పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ అధ్యక్షతన కార్యకర్తల నియోజకవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తాను మీలో ఒక్కనిగా జగనన్న నియమించిన సైనికునిలా పార్టీ బలోపేతం కోసం మీ సూచనలు, సలహాలతో పార్టీని ముందుకు తీసుకెళతానని చెప్పారు. గతంలో మనం చేసిన పొరబాట్లను సరిదిద్దుకుని వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు విలువలేని పార్టీలు మనుగడ సాగించినట్టు చరిత్రలో లేవని అందుకే మనం ఈ దఫా కార్యకర్తలకు పెద్దపీట వేయాలన్న సంకల్పంతో ముందుకెళతామన్నారు. మాట తప్పిన కూటమి ప్రభుత్వాన్ని కడిగేసేందుకు, ప్రజల పక్షాన జగనన్న వచ్చే ఫిబ్రవరి నుంచి జనంలోకి రానున్నారని తెలిపారు. 3,648 కిలో మీటర్ల పాదయాత్ర చేసి, 2.5 కోట్ల మందితో నేరుగా సంభాషించిన నేత జగన్‌మోహన్‌రెడ్డి మినహా ప్రపంచంలో మరెవరూ లేరన్నారు. రాష్ట్రంలో 60 శాతం పేదలున్నందున పార్టీలు, కులాలతో సంబంధం లేకుండా అర్హులైన వారికి సంక్షేమాన్ని అందించాలనే తలంపుతో నాడు జగనన్న పథకాలు అందించారన్నారు. అదే ఆయన చేసిన తప్పా? అని ప్రశ్నించారు. శత్రువుకు కూడా మేలు చేయాలనే సంకల్పం ఆయనదని, కూటమినేతల లాంటి స్వార్థరాజకీయాలు ఆయనకు తెలివన్నారు. నాడు చంద్రబాబు ఓటమి చెందాక రెండున్నరేళ్లు జనంలోకి రాలేదని, కానీ జగనన్న జనం కోసం మూడునెలల్లోనే వచ్చాడన్నారు. 40 శాతం ఓట్లు వచ్చి, ఓటమి పాలైన పార్టీ ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. కేవలం కేంద్రంతో లాలూచీ పడి జగన్‌మోహన్‌రెడ్డిని ఓ భూతంలా చూపి, కొన్ని శక్తులంతా ఏకమై ఈవీఎలంను మార్చి, అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేగౌడ, తిప్పేస్వామి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, డీసీసీబీ మాజీ చైర్మన్ రెడ్డెమ్మ, మండల కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, మాజీలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫిబ్రవరి నుంచి జనంతోనే జగనన్న
వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం
భూమన కరుణాకర రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment