బడి పనివేళల పెంపుతో చిన్నారులు అధిక సమయం నాలుగు గోడలకే పరిమితం.. కాసింత సేపు కూడా ఆటపాటలకు దూరం.. వెరసి ఒత్తిడి.. మంకుపట్టు, పిరికితనం పెరుగుదల.. ఫలితం మరుగున పడనున్న నైపుణ్యాలు.. విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం.. మా బిడ్డల చదువెలా సాగాలని తల్లిదండ్రుల అంతర్మథనం.. ఇదీ పాఠశాల సమయం మార్పుతో కలగనున్న దుష్ప్రభావం అని విద్యావేత్తల అభిప్రాయం.
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా వింత పోకడలకు తెరలేపుతోంది. తల్లికి వందనం హామీ ఇచ్చి అమలు చేయకుండా తల్లిదండ్రులను కూటమి సర్కారు మోసం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడంలో వెనుకబడింది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి, ఇంతవరకు నోటిఫికేషన్ జారీ చేయకుండా వెనుకడుగు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టాల్సిన కూటమి సర్కారు విద్యార్థులకు ఇబ్బందులు సృష్టించే వింత నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలల సమయం లేదని విద్యావేత్తలు అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఉద యం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలల సమయం పెంచేందుకు నిర్ణయం తీసుకు ని, పైలెట్ ప్రాజెక్టుగా పలు పాఠశాలల్లో అమలు చేసేందుకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, టీచర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం పాఠశాలల సమయం పెంపు విషయంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని కచ్చితంగా మార్చుకోవాల్సిందేనని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నిర్ణయంతో ఎలాంటి ఉపయోగం ఉండదంటున్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోకుండా ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగదని హెచ్చరిస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు సమీపంలో ఉన్న తమిళనాడులో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు, కర్ణాటకలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తున్నారని టీచర్లు చెబుతున్నారు. తెలంగాణాలో సైతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు వాపోతున్నారు. రాష్ట్రంలో మాత్రం కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోకుండా సమయం మార్పులు చేయడంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. సర్కారు నిర్ణయం మార్చుకోకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు.
నిర్ణయం మార్చు కోవాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment