సాక్షి, విశాఖపట్నం: గాజువాక శ్రీనగర్‌లోని ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మిని పాశవికంగా హత్యచేసిన నిందితుడు అఖిల్‌సాయిని పోలీసులు సెంట్రల్ జైల్‌కి తరలించారు. అక్కడి అధికారులు అఖిల్‌కి ఖైదీ నెంబర్ 7411 కేటాయించారు. గాజువాక పోలీసులు నిందితుడు అఖిల్ సాయిని ఆదివారం అరెస్ట్ చేసి దిశ చట్టం ప్రకారం, సెక్షన్ 302 ప్రకారం హత్య కేసు నమోదు చేశారు. కోవిడ్ టెస్ట్ అనంతరం న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రణాళిక ప్రకారమే వరలక్షి్మని హత్య చేశారని దర్యాప్తులో తేలడంతో పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే నిందితుడు అఖిల్, అతని కుటుంబం గత చరిత్రపైనా పోలీసులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గాజువాక పోలీసులు సంఘటన స్థలంతోపాటు నిందితుడు, స్థానికులు, నిందితుడి కుటుంబ సభ్యులు, స్నేహితుల ద్వారా పలు విషయాలు సేకరించినట్లు చెబుతున్నారు. వరలక్ష్మి బయటకు వచ్చిన సమయంలో... కావాలనే వాగ్వాదానికి దిగి ఎలాగైనా చంపేద్దామని ప్రణాళిక ప్రకరం అఖిల్ వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు హత్యకు ముందు నాలుగు రోజుల నుంచి వరలక్ష్మిని అఖిల్‌సాయి ఫోన్‌లో వేధించేవాడని, దీంతో ఆమె మనస్తాపానికి గురైందని... బంధువుల పెళ్లి హడావిడిలో కుటుంబ సభ్యులంతా ఉండగా అఖిల్ యువతిని భయపెట్టేవాడని విచారణలో తేలింది.
అఖిల్ తండ్రి సత్యారావుపై రౌడీషీట్..
అఖిల్ తండ్రి సత్యారావుపై అప్పట్లో 53/11పేరిట రౌడీషీట్ ఉందని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. భూ కబ్జా కేసుకు సంబంధించి పోలీసులు రౌడీషీట్ తెరవగా కొన్నాళ్ల తరువాత సత్యారావు సత్ప్రవర్తన నేపథ్యంలో ఆ షీట్ ఎత్తేశారని చెబుతున్నారు. అయితే ఆయన కుమారుడు అఖిల్ చేసిన హత్య తర్వాత... అఖిల్ తండ్రికి ఎవరెవరు రౌడీïÙటర్లతో పరిచయముందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఓ రౌడీషీటర్ కుమారుడు పాత్రపైనా అనుమానం..?
అదేవిధంగా ఇటీవల హత్యకు గురైన ఓ రౌడీషీటర్ కుమారుడు పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరలక్ష్మి విషయంలో ఆమె సోదరుడు జయప్రకాష్, అఖిల్‌సాయి ఓ రౌడీషీటర్ కుమారుడితో కలిసి గత నెల 29న రామునాయడు అనే యువకుడిపై దాడికి దిగినట్లు చెబుతున్నారు. వరలక్ష్మితో రాము సన్నిహితంగా ఉంటున్నాడని తెలుసుకున్న అఖిల్ ప్రణాళిక ప్రకారం ఆమె సోదరుడు జయప్రకాష్‌ను రెచ్చగొట్టి రాముని భయపెట్టాడు. తాను కేవలం బండి మాత్రమే నడిపానని, రామునాయడిపై దాడి చేసింది అఖిల్ అని జయప్రకాష్ స్వయంగా పోలీసుల ముందు అంగీకరించినట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment