చంద్రబాబు వల్లే ఏపీలో ఘోరాలు
టీడీపీ గూండాలు చెలరేగిపోతున్నారు
వైఎస్సార్‌సీపీ నాయకులమండిపాటు
వినుకొండలో రషీద్‌కు ఘన నివాళులు
వినుకొండ(నూజెండ్ల): రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రోత్సాహం వల్లే టీడీపీ గూండాలు చెలరేగిపోయి..రాష్ట్రమంతటా రక్తపాతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలు క్షీణించి.. ప్రజలకు రక్షణ కరువైందన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.
పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ గూండా చేతిలో ప్రాణాలు కోల్పోయిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌కు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు గురువారం నివాళులర్పించారు.
రషీద్ కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నిందితుడు టీడీపీకి చెందిన వాడైనప్పటికీ సోషల్ మీడియాలో తమ పార్టీవాడు కాదంటూ టీడీపీ చేస్తోన్న అసత్య ప్రచారాన్ని వారు ఖండించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఇతర టీడీపీ నాయకులతో నిందితుడు సన్నిహితంగా దిగిన ఫొటోలను మీడియాకు చూపించారు. అనంతరం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు.
టీడీపీ నేతల అండతోనే రషీద్ హత్య: మర్రి రాజశేఖర్
వినుకొండ నడిబొడ్డున వందలాదిమంది చూస్తూండగా వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ గూండా జిలానీ అత్యంత కిరాతకంగా కత్తితో నరికాడంటే రాష్ట్రంలోని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ నేరాలన్నింటికీ చంద్రబాబే బాధ్యత వహించాలి. టీడీపీ ఎమ్మెల్యేల చెప్పినట్లుగా జిల్లా ఎస్పీని మార్చిన వెంటనే పల్నాడులో హత్యలు మొదలయ్యాయి. టీడీపీ నాయకుల అండదండలతోనే ఈ హత్య జరిగింది. పోలీసులు పక్షపాతం లేకుండా వ్యవహరించి బాధ్యులందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి.
హత్యా రాజకీయాలు మానుకోవాలి: గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
కూటమి పార్టీలు గెలిచినప్పటి నుంచి కేవలం నెల రోజుల్లోనే 31 హత్యలు జరిగాయి. పల్నాడు ప్రాంతంలో 1,500కు పైగా కుటుంబాలు గ్రామాలు విడిచి పెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలస వెళ్లారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. హత్యారాజకీయాలను వెంటనే మానుకోవాలి. ఇప్పటికైనా హామీల అమలు మొదలుపెట్టి..ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలి.
3 రేప్‌లు, 30 హత్యలుగా పాలన: కాసు మహేశ్‌రెడ్డి
ఏపీలో టీడీపీ ప్రభుత్వ పాలన 3 రేప్‌లు, 30 హత్యలుగా కొనసాగుతోంది. ప్రశాంతంగా ఉన్న వినుకొండలో మొహర్రం రోజున రషీద్ అనే యువకుడిని టీడీపీ గూండా హత్య చేశాడంటే..టీడీపీ పాలన ఎలా ఉందో ప్రజలకూ అర్థమవుతోంది. పట్టణంలో నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా రషీద్‌ను అత్యంత పాశవికంగా నరికి చంపడం దారుణం. కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడవేసి..రెడ్‌బుక్ పాలన కొనసాగిస్తోంది. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రషీద్ కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పాం.
హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: బొల్లా బ్రహ్మనాయుడు
ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రోద్భలంతోనే జిలానీ అనే టీడీపీ గూండా నడిరోడ్డుపై వినుకొండలో అత్యంత దారుణంగా రషీద్‌ను హత్య చేశాడు. మృతుని కుటుంబానికి అండగా ఉంటాం.15 నుంచి 20 మంది యువకులు ముందుగానే రషీద్‌ను హత్య చేసేందుకు పథకం వేశారు. కేవలం ఒక యువకుడే వెంబడించి రషీద్‌ను రాక్షసత్వంగా చంపేశాడు. పోలీస్ శాఖ ఈ హత్యకు బాధ్యత వహించాలి. మృతుని కుటుంబానికి పార్టీ పరంగా ఆర్థికంగా భరోసా అందిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment