![E-Nuggets: ED raids Kolkata premises in fraud mobile gaming app case - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/11/e-nuggerets.jpg.webp?itok=vVauV5Ka)
న్యూఢిల్లీ/కోల్‌కతా: మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కోల్‌కతాకు చెందిన మొబైల్ గేమింగ్ యాప్ కంపెనీ ప్రమోటర్ల నివాసాల్లో శనివారం సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.17 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. బెడ్‌పై పేర్చిన రూ.2000, రూ.500, రూ.200 నోట్ల కట్టల ఫొటోను ఈడీ విడుదల చేసింది. అమీర్ ఖాన్, అతడి కుమారుడు నెజార్ అహ్మద్ ఖాన్ కలిసి ‘ఈ–నగ్గెట్స్ పేరిట మొబైల్ గేమింగ్ యాప్ ప్రారంభించారు. వారితోపాటు మరికొందరు ఈ కంపెనీ ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు.
వారికి చెందిన దాదాపు 6 నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టామని ఈడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. రూ.17 కోట్ల నగదు లభ్యమైందని, నోట్ల కట్టల లెక్కింపు ఇంకా కొనసాగుతోందని పేర్కొంది. ఈ–నగ్గెట్స్ కంపెనీ గేమింగ్ యాప్ ద్వారా ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి, వాటిని తిరిగి వెనక్కి తీసుకొనే అవకాశం ఇవ్వకుండా మోసం చేస్తోందంటూ ఫెడరల్ బ్యాంకు అధికారులు కోల్‌కతా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు కంపెనీతోపాటు ప్రమోటర్లపై కోల్‌కతా పోలీసులు 2021 ఫిబ్రవరిలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఈ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. గేమింగ్ యాప్ కంపెనీ ప్రమోటర్ల నివాసాల్లో ఈడీ సోదాలకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీం చెప్పారు. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఈడీ సొదాలు జరుగుతుండడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్న వ్యాపారవేత్తలపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని నిలదీశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల వల్ల బెంగాల్‌కు పెట్టుబడులు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment