Hyderabad: నగరంలో 8 మంది అదృశ్యం | Eight People Missing in Hyderabad City | Sakshi
Sakshi News home page

భర్త ఊరెళ్లొచ్చేసరికి ఒకరు.. ఇంట్లో చెప్పకుండా మరొకరు.. నగరంలో 8 మంది అదృశ్యం

Published Sat, Feb 5 2022 6:42 PM | Last Updated on Sat, Feb 5 2022 6:58 PM

Eight People Missing in Hyderabad City - Sakshi

మమత, దీపిక, మహేష్కర్‌ గిరిధర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: వేర్వేరు ప్రాంతాల్లో ఒకే రోజు ఎనిమిది మంది అదృశ్యమైన సంఘటన బోయిన్‌పల్లి, లాలాగూడ, సికింద్రాబాద్‌ జీఆర్‌పీ పోలీసు స్టేషన్‌ల పరిధిలో చోటు చేసుకుంది. వీరిలో ఇద్దరు మతిస్థిమితం లేని యువకులు కాగా, మరో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

మతిస్థిమితం లేని యువకుడు..
కొడంగల్, రావులపల్లికి చెందిన బీ­మయ్య చిన్నతోకట్టాలో నివాసముంటున్నాడు. వీరి ఇంట్లోనే ఉంటున్న అతడి మేనల్లుడు రవి కుమార్‌ (19)కు మతిస్థిమితం లేదు. ఈ నెల 1న ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన రవికుమార్‌ తిరిగి రాకపోవడంతో భీమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

టీ తెచ్చేందుకు వెళ్లిన బాలుడు..
బోరబండలో ఉంటున్న దర్లావత్‌ గుత్యా కుమారుడు రమేశ్‌ (13)తో కలిసి గత నెల 26న బోయిన్‌పల్లి పెన్షన్‌లైన్‌లో ఉంటున్న తమ బంధువు ఇంటికి వచ్చాడు. మతిస్థిమితం సరిగా లేని రమేశ్‌ను టీ తెమ్మని బయటికి పంపగా, అతను తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
బర్త్‌డే పార్టీకి వెళ్లిన కుటుంబం అదృశ్యం 
బోయిన్‌పల్లి బాపూజీనగర్‌కు చెందిన సురేశ్‌ కుమార్, భార్య సంతోషి, కుమారుడు లిఖిత్‌తో కలిసి గత నెల 30న బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఈ నెల 1న సురేశ్‌ బంధువు వెంకటేశ్, అతని డ్రైవర్‌ దుర్గా ప్రసాద్‌ బాపూజీనగర్‌లోని సురేశ్‌ ఇంటికి వచ్చారు. ఇళ్లు తాళం వేసి ఉండటంతో ఇంటి ఓనర్‌ను వాకబు చేయగా, రెండు రోజుల క్రితం బర్త్‌ డే పార్టీకని  బయటికి వెళ్లినట్లు తెలిపారు. సురేశ్‌ తండ్రి ధర్మపాల్‌కు సమాచారం ఇవ్వగా వారి కోసం గాలించినా ఆచూకీ తెలియరాలేదు. ఒకే రోజు పోలీసు స్టేషన్‌లో మూడు కేసులు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  

చదవండి: (Hyderabad: అసెంబ్లీ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం)

యువతి అదృశ్యం 
అడ్డగుట్ట: ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాఘవేంద్ర స్వామి కథనం ప్రకారం. లాలాపేట, సత్యనగర్‌ ప్రాంతానికి చెందిన గండు నర్సింగ్‌రావు కుమార్తె గండు దీపిక(19) నాచారంలోని ఓ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా ట్రెయినింగ్‌ తీసుకుంటోంది. ఈ నెల 3న ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన దీపిక ఇంటికి తిరిగిరాలేదు. ఆమె కుటుంబసభ్యులు గాలింపు చేపట్టినా ఫలితం లేకపోవడంతో అదే రోజు రాత్రి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: (సామాజిక మాధ్యమాల్లో భార్య నగ్న దృశ్యాలు.. విటులకు ఆహ్వానం..)

భర్త ఊరెళ్లొచ్చేసరికి భార్య..
భర్త ఊరెళ్లొచ్చేసరికి భార్య అదృశ్యమైన ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇందిరానగర్‌  బి కాలనీలో నాగేంద్ర, మమత దంపతులు నివాసం ఉంటున్నారు. నాగేంద్ర ఇటీవల అనంతపురం వెళ్లాడు. గత నెల 30న ఊరి నుంచి తిరిగి వచ్చే సరికి ఇంటికి తాళం వేసి ఉంది. మమత కోసం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం లాలాగూడ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

ఇంజినీరింగ్‌ విద్యార్థి..
సికింద్రాబాద్‌: ఇంజినీరింగ్‌ విద్యార్థి అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. జీఆర్‌పీ పోలీసుల కథనం ప్రకారం. సంగారెడ్డికి చెందిన మహేష్కర్‌ గిరిధర్‌ రోజు రైలులో కాలేజీకి రాకపోకలు సాగించేవాడు. ఈనెల 3న కాలేజీకి వెళ్లిన మహేష్కర్‌ గిరిధర్‌ ఇంటికి తిరిగి రాలేదు. ఆయన ఆచూకీ కోసం వాకాబు చేసిన ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వేపోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement