చేతిలో చిల్లిగవ్వలేక మృతుడి భార్య కన్నీరుమున్నీరు
దాతలు ముందుకు రావడంతో కార్యక్రమం పూర్తి
హృదయాలను ద్రవింపజేసిన విషాద ఘటన
హుజూరాబాద్ రూరల్: మృత్యువు హఠాత్తుగా భర్తను కబళించింది. అంత్యక్రియలకు పేదరికం ఆటంకంగా నిలిచింది. కన్నీళ్లు దిగమింగుకున్న ఆ ఇల్లాలు సాయం కోసం వేడుకోగా.. స్పందించిన మానవత్వం చివరి మజిలీకి అవసరమైన సాయం చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ధర్మరాజుపల్లిలో చోటుచేసుకుంది. ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన కోట లక్ష్మణ్–ప్రేమలత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు. కూలినాలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కూతుళ్లకు ఉన్నంతలో వివాహం జరిపించారు.
ఇక తమ బతుకు తాము బతుకుదామనుకునే సమయంలో లక్ష్మణ్ మంగళవారం ఇంటి వద్ద హఠాత్తుగా కిందపడిపోయాడు. ఆ సమయంలో అందుబాటులో ఎవరూ లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆలస్యమైంది. చివరకు కొందరు గ్రామస్తులు అక్కడకు రావడంతో వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. ఈ క్రమంలోనే చికిత్స అందిస్తుండగానే లక్ష్మణ్ మృతి చెందాడు.
మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకొచ్చేందుకు అద్దె ఇంటి యజమాని అడ్డు చెప్పాడు. దీంతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం.. దుఃఖాన్ని దిగమింగుకుంది. ఊరు బయటనే ఓ డేరా వేయించి అక్కడే మృతదేహాన్ని ఉంచారు. అయితే, అంత్యక్రియలు పూర్తిచేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో మృతుడి భార్య కన్నీటిపర్యంతమైంది. మృతదేహాన్ని చూసేందుకు వచి్చన వారిని సాయం చేయాలని ప్రాధేయపడింది.
తల్లీకూతుళ్లు చేతులు చాచి ఆర్థికసాయం కోసం విన్నవించడం గ్రామస్తులకు కంటతడి పెట్టించింది. స్పందించిన వారు తలాకొంత పోగుచేసి రూ.80 వేలను మృతుడి కుటుంబానికి అందజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ సూచన మేరకు ఆ పార్టీ నాయకులు కూడా కొంత నగదు అందజేయడంతో అంత్యక్రియలు పూర్తయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment