సూరి (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: ‘వెబ్ సిరీస్’ కిడ్నాపర్ గంజపోగు సురేష్ అలియాస్ సూరి వ్యవహారాలకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతగాడు తన గ్యాంగ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గండికోట రవి అనే యువకుడిని రెండుసార్లు కిడ్నాప్ చేశాడని బయటపడింది. ఏడాది వ్యవధిలో జరిగిన ఈ అపహరణల్లో అతడి కుటుంబం నుంచి నగదు వసూలు చేశాడు. ఇక్కడి అధికారుల విచారణ ముగిసిన తర్వాత సూరిని పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లడానికి తెనాలి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
బీచ్‌కు పోదామంటూ తొలిసారి...
తెనాలి మండలం అంగలకోడూరు గ్రామానికి చెందిన గండికోట రవి వివాహితుడు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో మూడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఇతడికి ఏడాది క్రితం ఫేస్‌బుక్ ద్వారా సూర్య పేరుతో సూరి పరిచయమయ్యాడు. ఇద్దరూ స్నేహితులుగా మారడంతో పాటు ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకుని కొన్నాళ్లు చాటింగ్స్ చేసుకున్నారు. సూరి ఓ రోజు తాను బాపట్ల బీచ్ చూడాలని అనుకుంటున్నానంటూ రవితో చెప్పాడు. దీంతో అంగలకోడూరు వరకు రావాలని, ఇద్దరం కలిసి వెళ్లి బీచ్ చూద్దామంటూ అతడు కోరాడు. పథకం ప్రకారం తన అనుచరులతో కారులో అంగలకోడూరు వరకు వెళ్లిన సూరి అందులోనే రవిని కిడ్నాప్ చేసి సిటీకి తీసుకువచ్చాడు.
చదవండి: హైదరాబాద్: మార్చి నాటికి మరో నాలుగు ప్రాజెక్టులు
శ్వేత ద్వారా ఎర వేసి...
రవిని ఓ గదిలో బంధించి ఉంచిన సూరి తీవ్ర స్థాయిలో బెదిరించాడు. ఆపై అతడి తల్లికి ఫోన్ చేసి డబ్బు చెల్లించాలని లేదంటే రవిని చంపేస్తామంటూ హెచ్చరించాడు. ఇలా ఆమె నుంచి ఫోన్ పే ద్వారా రూ.50 వేలు వసూలు చేసి రవిని విడిచిపెట్టాడు. అప్పటికే తీవ్రభయాందోళనల్లో ఉన్న రవి ఈ విషయాన్ని పోలీసులకూ ఫిర్యాదు చేయలేదు. ఇటీవల మరోసారి అతడిని టార్గెట్ చేసిన సూరి తన ‘ఉద్యోగిని’ శ్వేత చారిని రంగంలోకి దింపాడు. ఫేస్‌బుక్ ద్వారా రక్షిత పేరుతో రవికి పరిచయమైన ఈమె అతడి ఫోన్ నెంబర్ తీసుకుంది. కొన్నాళ్లు మాట్లాడిన తర్వాత గత నెల 5న అసలు కథ మొదలెట్టింది. తాను సూర్యాపేటలో ఉంటానని, వస్తే కలుద్దామంటూ ఎర వేసింది. దీంతో 16న రవి ద్విచక్ర వాహనంపై సూర్యాపేట వచ్చాడు.
గదిలో బంధించి డబ్బు వసూలు...
అప్పటికే అక్కడ కాసుకుని ఉన్న సూర్య అండ్ గ్యాంగ్ తమ కారులో రవిని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకువచ్చింది. మరోసారి అతడి తల్లికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగడంతో పాటు రూ.5 లక్షలు డిమాండ్ చేసింది. బేరసారాల తర్వాత ఫోన్ పే ద్వారా రూ.55 వేలు వసూలు చేసి అతడిని వదిలిపెట్టింది. తన స్వస్థలానికి తిరిగి వెళ్లిన రవి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడాడు. రెండుసార్లు తమ వల్లోపడిన రవి నుంచి మరికొంత మొత్తం వసూలు చేయాలని భావించిన సూరి మళ్లీ ఫోన్లు చేయడం మొదలెట్టాడు. తనకు డబ్బు కావాలంటూ బెదిరిస్తుండటంతో ఈ నెల 13న ర వి తెనాలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment