![Inter Second Year Student Suicide Because Of Pubg Game - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/25/sfff.jpg.webp?itok=WO6KPBKu)
బాలుడు దూకడంతో కుప్పకూలిన కరెంట్ స్తంభం
వెంకటేశ్వరకాలనీ (హైదరాబాద్): పబ్‌జీ ఆడొద్దని తండ్రి మందలించినందుకు ప్రాణాలు తీసుకోబోయాడో విద్యార్థి.. ఏకంగా ఐదంతస్తుల భవనంపై నుంచి దూకగా అదృష్టవశాత్తు స్వల్పగాయాలతో బయటపడ్డాడు.. పంజగుట్ట ప్రతాప్‌నగర్‌లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం నివాసముంటోంది. ఆన్‌లైన్ క్లాసులున్న నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న బాలుడు (17) కొన్ని రోజులుగా పబ్‌జీ ఆటకు బానిసయ్యాడు. అది గమనించిన ఆ బాలుడి తండ్రి శనివారం రాత్రి అతడిని మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలుడు పక్కనే ఉన్న ఐదంతస్తుల ఇంటిపైకి ఎక్కి కిందికి దూకేశాడు.
ఈ క్రమంలో నేరుగా కరెంటు వైర్లు, కేబుల్ వైర్లపై పడి కిందకు జారాడు. అదృష్టవశాత్తు బాలుడికి స్వల్ప గాయాలే కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఇటు వైర్లపై ఒకేసారి భారం పడటంతో కరెంటు స్తంభం కూడా కూలింది. బాలుడిని సమీపంలోని తన్వీర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇటు కరెంటు స్తంభం కూలడంతో శనివారం రాత్రి 8.30 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. సమాచారమందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి వైర్ల కనెక్షన్లను పునరుద్ధరించారు.
Comments
Please login to add a commentAdd a comment