బుధవారం అర్ధరాత్రి మాచర్ల మేజిస్ట్రేట్ ముందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
తెల్లవారుజామున 4 వరకు వాదనలు
ఈవీఎం ధ్వంసం, మహిళను బెదిరించిన కేసుల్లో బెయిల్
సీఐలపై దాడి కేసుల్లో రిమాండ్.. కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు సెంట్రల్ జైల్‌కు తరలింపు
కోర్టు ప్రాంగణంలో పిన్నెల్లిపై దాడికి యత్నించిన టీడీపీ కార్యకర్త శివ
అడ్డుకోని పోలీసులు.. శివను తోసుకుంటూ కోర్టులోకి వెళ్లిన పీఆర్కే
కోర్టు ఎదుటే బాణసంచా కాల్చి కవ్వించిన టీడీపీ శ్రేణులు
సాక్షి, నరసరావుపేట/నెల్లూరు (క్రైం): పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల అదనపు జూనియర్ సివిల్ కోర్టు రెండు కేసుల్లో 14 రోజుల రిమాండ్ విధించింది. మరో రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ మేజిస్ట్రేట్ ఎస్. శ్రీనివాస కల్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ రోజు, తరువాత జరిగిన ఘటనలపై తనపై అక్రమ కేసులు నమోదు చేశారంటూ పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను బుధవారం మధ్యాహ్నం హైకోర్టు తోసిపుచ్చడం, ఆ వెంటనే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
బుధవారం రాత్రి నరసరావుపేట ఏరియా వైద్యశాలలో వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని మాచర్లకు తరలించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శ్రీనివాస కల్యాణ్ ముందు హాజరుపరిచారు. ఆయనపై నమోదైన నాలుగు కేసులపై విడివిడిగా ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. తెల్లవారుజాము నాలుగు గంటల వరకు వాదనలు కొనసాగాయి. మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేట్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం కేసు, పోలింగ్ బూత్ ముందు మహిళను బెదిరించారంటూ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కారంపూడి సీఐ నారాయణస్వామి, టీడీపీ నేత నంబూరి శేషగిరిరావుపై దాడి కేసుల్లో రిమాండ్ విధించింది. పిన్నెల్లిని నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. వెంటనే ఆయన్ని పటిష్ట భద్రత మధ్య నెల్లూరు తీసుకెళ్లారు. గురువారం ఉదయం 8.30 గంటలకు నెల్లూరులోని కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ముందు జాగ్రత్తగా కేంద్ర కారాగారం వద్ద పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎవరూ అక్కడికి రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.
కోర్టు వద్దే పిన్నెల్లిపై దాడికి యత్నం
పెన్నెల్లిని కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువచ్చిన సమయంలో కోర్టు వద్దే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనపై దురుసుగా వ్యవహరించారు. పిన్నెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు ముందే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. పిన్నెల్లి కోర్టు లోపలికి వెళ్తున్న సమయంలో మాచర్లకు చెందిన టీడీపీ కార్యకర్త కొమేర శివ అడ్డంగా నిలబడి దురుసుగా మాట్లాడాడు. ఆయనపై దాడి చేయబోయాడు. పోలీసులు అడ్డుకోకపోవడంతో పిన్నెల్లి అతన్ని తోసుకొని కోర్టులోకి వెళ్లిపోయారు.
కోర్టు వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది. మాజీ ఎమ్మెల్యేని కోర్టులో హాజరుపరుస్తున్న సందర్భంలో ప్రత్యర్ధి పార్టీ అయిన టీడీపీ కార్యకర్తలను అక్కడకు అనుమతించడమే కాకుండా వారు రెచ్చగొట్టేలా దుర్భాషలాడుతున్నా, బాణాసంచా కాల్చుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. పిన్నెల్లిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసే అవకాశం ఉందని తెలిసి కూడా ఆయన్ని కోర్టుకు తీసుకువచ్చే సమయానికి వారిని చెదరగొట్టలేదు.
పిన్నెల్లిని కోర్టు లోపలికి తీసుకువెళ్లే సమయంలో ఆయన ముందు పోలీసులు ఎవరూ లేరు. అందువల్లే టీడీపీ కార్యకర్త శివ కోర్టు ప్రాంగణంలోనే నేరుగా పిన్నెల్లికి ఎదురు రాగలిగాడు. వెంటనే అతన్ని నిలువరించకపోగా, అతను కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, దాడికి యత్నించినా పట్టించుకోకపోవడం పోలీసుల ఉద్దేశపూర్వక చర్యేనని వైఎస్సార్‌సీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. పైగా, ఉద్దేశపూర్వకంగా కోర్ట వద్దే పిన్నెల్లికి అడ్డు నిలబడి, దుర్భాషలాడిన టీడీపీ కార్యకర్త శివే తనపై పిన్నెల్లి దాడి చేశారంటూ మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment