సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. అరెస్ట్ సమయంలో పిన్నెల్లిపై టీడీపీ నేత శివ దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. పిన్నెల్లిని కదలనివ్వకుండా అడ్డంగా నిలబడిన శివ.. అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి యత్నించాడు.
పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేత దౌర్జన్యానికి దిగాడు. శివ ఇచ్చిన ఫిర్యాదుతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు.. అయితే పిన్నెల్లిపై దాడికి యత్నించిన శివపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. పిన్నెల్లిపై అక్రమంగా కేసు నమోదు చేయడంపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిన్నెల్లిని కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువచ్చిన సమయంలో కోర్టు వద్దే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనపై దురుసుగా వ్యవహరించారు. పిన్నెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు ముందే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. పిన్నెల్లి కోర్టు లోపలికి వెళ్తున్న సమయంలో మాచర్లకు చెందిన టీడీపీ కార్యకర్త కొమేర శివ అడ్డంగా నిలబడి దురుసుగా మాట్లాడాడు. ఆయనపై దాడి చేయబోయాడు.
కోర్టు వద్ద పోలీసులు వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికి గురి చేసింది. మాజీ ఎమ్మెల్యేని కోర్టులో హాజరుపరుస్తున్న సందర్భంలో ప్రత్యర్ధి పార్టీ అయిన టీడీపీ కార్యకర్తలను అక్కడకు అనుమతించడమే కాకుండా వారు రెచ్చగొట్టేలా దుర్భాషలాడుతున్నా, బాణాసంచా కాల్చుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. పిన్నెల్లిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసే అవకాశం ఉందని తెలిసి కూడా ఆయన్ని కోర్టుకు తీసుకువచ్చే సమయానికి వారిని చెదరగొట్టలేదు.
పిన్నెల్లిని కోర్టు లోపలికి తీసుకువెళ్లే సమయంలో ఆయన ముందు పోలీసులు ఎవరూ లేరు. అందువల్లే టీడీపీ కార్యకర్త శివ కోర్టు ప్రాంగణంలోనే నేరుగా పిన్నెల్లికి ఎదురు రాగలిగాడు. వెంటనే అతన్ని నిలువరించకపోగా, అతను కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, దాడికి యత్నించినా పట్టించుకోకపోవడం పోలీసుల ఉద్దేశపూర్వక చర్యేనని వైఎస్సార్‌సీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. పైగా, ఉద్దేశపూర్వకంగా కోర్ట వద్దే పిన్నెల్లికి అడ్డు నిలబడి, దుర్భాషలాడిన టీడీపీ కార్యకర్త శివే తనపై పిన్నెల్లి దాడి చేశారంటూ మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment