సాక్షి, జన్నారం(ఆదిలాబాద్): అవసాన దశలో అండగా ఉండాల్సిన తనయుడు కాలయముడయ్యాడు. పెళ్లికి అడ్డొస్తున్నాడనే అనుమానంతో మద్యంమత్తులో తండ్రిని కర్రతో కొట్టి చంపాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఏసీపీ అఖిల్ మహాజన్, మృతుడి భార్య ప్రమీల తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం గ్రామానికి చెందిన నెమలికొండ పాపయ్య(60), ప్రమీల దంపతులకు నలుగురు సంతానం. పెద్ద కుమారుడు తిరుపతి(30) మేస్త్రీ పని చేస్తుంటాడు. కొన్నేళ్లుగా మద్యానికి బానిసగా మారాడు. ఈ కారణంగా అతడికి పెళ్లి జరగడం లేదు.
తన తండ్రి కారణంగానే వివాహం కావడం లేదని పలుమార్లు ఇంట్లో గొడవపడ్డాడు. మంగళవారం పెళ్లి విషయమై తండ్రి కొడుకుల మధ్య వివాదం జరిగింది. మద్యంమత్తులో ఆగ్రహంతో ఉన్న తిరుపతి రాత్రి 8గంటల ప్రాంతంలో మంచంలో పడుకున్న తండ్రి పాపయ్యను కర్రతో తలపై కొట్టాడు. తీవ్ర గాయపమైన అతడిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున మృతిచెందాడు. ఏసీపీతోపాటు లక్సెట్టిపేట సీఐ నారాయణ్‌నాయక్, ఎస్సై తానాజీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment