Woman Assassinated Husband With Lover Help In Bhupalpally District - Sakshi
Sakshi News home page

ఇష్టం లేని పెళ్లి.. పిల్లలు పుట్టడానికి మందు అని చెప్పి, ప్రియుడితో కలిసి

Published Mon, Jun 27 2022 6:23 PM | Last Updated on Mon, Jun 27 2022 7:53 PM

Woman Assassinated Husband With Lover Help In Bhupalpally District - Sakshi

సాక్షి, జయశంకర్‌ భూపాలపల్లి: పిల్లలు పుట్టడానికి మందు తెచ్చానంటూ భర్తకు పురుగుల మందు తాగించి హతమార్చిందో భార్య. ఇష్టంలేని పెళ్లి చేశారని, ప్రియుడిపై మోజుతో ఈ ఘాతుకానికి పాల్పడింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కన్నెపల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలను కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో సీఐ కిరణ్‌కుమార్‌ ఆదివారం వెల్లడించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా జానెంపల్లికి చెందిన మౌనికకు.. కన్నెపల్లికి చెందిన పిట్టల సమ్మయ్య(28)కు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.

మౌనికకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో భార్యభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి. సమ్మయ్య ఆమెను శారీరకంగా మానసికంగా హింసించేవాడు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం తల్లిగారింటికి వెళ్లింది. 10 రోజుల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా ఇష్టం లేకపోయినా కాపురానికి వెళ్లింది. అయితే, పుట్టింట్లో ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన పిట్టల రాజుతో మౌనికకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో భర్తను ఎలాగైనా హతమార్చాలని రాజుతో కలిసి పథకం వేసింది.

అతడు కూడా ఒప్పుకోవడంతో ఈనె 22న రాజుకు ఫోన్‌ చేసి పురుగుల మందు తీసుకురావాలని చెప్పింది. అదే రోజు సాయంత్రం అతడు బస్సులో వచ్చి పురుగుల మందు డబ్బా ఇచ్చి వెళ్లాడు. అదే రోజు రాత్రి డాబాపై నిద్రిస్తున్న సమ్మయ్యకు పిల్లలు పుట్టడానికి మందు తెచ్చానంటూ నమ్మించి తాగించింది. ఆ తర్వాత కొంచెం మందును చెవిలో పోసింది. రాత్రి 11 గంటలకు రాజు సైతం గ్రామానికి చేరుకున్నాడు. మౌనిక, రాజు డాబాపైకి చేరుకున్నారు. సమ్మయ్య చనిపోకపోవడంతో చేతులను చున్నీ, టవల్‌తో మౌనిక మంచం కోళ్లకు కట్టేసింది.

రాజు.. సమ్మయ్య కాళ్లను గట్టిగా పట్టుకోగా మౌనిక దిండుతో ఊపిరాడకుండా చేసింది. కొన ఊపిరి ఉండడంతో గొంతును నలిమి చంపింది. ఆ వెంటనే ఘటనా స్థలం నుంచి రాజు పారిపోయాడు. తెల్లవారుజామున 2గంటలకు అత్తమామల వద్దకు వెళ్లిన మౌనిక మీ కొడుకు ఎంత లేపినా లేవడంలేదంటూ చెప్పింది. సమ్మయ్య తండ్రి కొండయ్య డాబాపైకి వచ్చి చూడగా మృతి చెంది కనిపించాడు. దీంతో కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు మౌనిక, ఆమె ప్రియుడు రాజు హత్య చేసినట్లు నిర్ధారించి అరెస్ట్‌ చేశారు. కేసును చేదించిన ఎస్సైలు లక్ష్మణ్‌రావు, నరేశ్, ఏఎస్సై మల్లేశ్వర్, సిబ్బందని సీఐ అభినందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement