
సాక్షి, హైదరాబాద్: నగరంలో సోమవారం రాత్రి నుంచి కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో బాచుపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ ఎన్‌ఆర్‌ఐ కాలనీ వద్ద నాలాలో పడిపోయి నాలుగేళ్ల బాలుడు నితిన్ గల్లంతయ్యాడు. ఈ క్రమంలో నిజాంపేట రాజీవ్ గృహకల్ప వద్ద బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో, నితిన్‌ను బయటకు తీసే ప్రయత్నం విఫలం కావడంలో అక్కడే ఉన్న తుర్క చెరువులోకి మృతదేహం కొట్టుకుపోయింది. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు, డీఆర్‌ఎఫ్ బృందాలు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. కొన్ని గంటల పాటు శ్రమించి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు.
ఇదిలా ఉండగా.. జంట నగరాల్లో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇళ్లలోకి వరదు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు, మేడ్చల్‌లో అపార్ట్‌మెంట్లలో మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరుకుంది. దీంతో, వరదల్లో చిక్కుకున్న వారిని జేసీబీల సాయంతో బయటకు తీసుకువచ్చారు అధికారులు.
ఇది కూడా చదవండి: Hyderabad : వర్షం దెబ్బకు హైదరాబాద్ ఏమయిందంటే.?