ఈవీఎంలలో పకడ్బందీ రక్షణ వ్యవస్థ | Sakshi
Sakshi News home page

ఈవీఎంలలో పకడ్బందీ రక్షణ వ్యవస్థ

Published Tue, May 7 2024 11:35 AM

ఈవీఎంలలో పకడ్బందీ రక్షణ వ్యవస్థ

అమలాపురం రూరల్‌: ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈవీఎంలు ప్రత్యేకమైనవని, వీటి అంతర్గత భద్రత, రక్షణ వ్యవస్థలు, పకడ్బందీగా ఉంటాయని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. ఈవీఎంల పనితీరుపై సోమవారం కలెక్టర్‌రేట్‌లో ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడానికి ఇవి ఉపయోగపడతాయన్నారు. మే 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికలకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసిందన్నారు. దానిలో భాగంగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. పోలింగ్‌ రోజున ఈవీఎంలను వినియోగించే విధానంపై ప్రిసైడింగ్‌ అధికారులకు సైతం శిక్షణ ఇచ్చామని తెలిపారు. కంట్రోల్‌ యూనిట్లోని బ్యాలెట్‌ బటన్‌ ద్వారా పీఓ అనుమతించిన తర్వాత ఓటరు బ్యాలెట్‌ యూనిట్లో ఓటు వేయడానికి వీలవుతుందన్నారు. బ్యాలెట్‌ యూనిట్లో అంధుల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపితో కూడిన గుర్తులు ఉంటాయని, చేతి వేళ్లతో తడిమితే స్పష్టంగా గుర్తు పట్టవచ్చునని వివరించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డమ్మీ ఈవీఎంలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు.

ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలను పకడ్బందీ బందోబస్తు నడుమ భద్రపరిచామని, ఎన్నికల నిబంధనల మేరకు ర్యాండమైజేషన్ల ప్రక్రియ పూర్తి చేశామన్నారు.

జిల్లాకు ఆరుగురు ఎన్నికల పరిశీలకులు

ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు ఇద్దరు సాధారణ, ముగ్గురు వ్యయ, ఒక పోలీస్‌ విభాగం పరిశీలకులు కలిపి మొత్తం ఆరుగురు ఐఏఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఐపీఎస్‌ అధికారులు నియమితులైనట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. వీరందరూ మలికిపురం మండలం దిండి ఆర్‌వీఆర్‌ సరోవర్‌లో అందుబాటులో ఉంటారన్నారు. సాధారణ పరిశీలకులు రాజేశ్వర్‌ గోయల్‌ (89789 62588) అమలాపురం పార్లమెంటు, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే మరో సాధారణ పరిశీలకులు పరదీప్‌ కుమార్‌ (89775 02588) ముమ్మిడివరం, రామచంద్రపురం, మండపేట, కొత్తపేట, అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణ తీరును పర్యవేక్షిస్తారన్నారు. పోలీస్‌ పరిశీలకులు ఎంవీ చంద్రకాంత్‌ (78932 56556) అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గంలో పోలీసు సంబంధిత సాధారణ ఎన్నికల నిర్వహణ తీరును తెలుసుకుంటారన్నారు.

వ్యయ పరిశీలకులు ఉమేష్‌ కుమార్‌ (78935 12588) పార్లమెంట్‌ స్థానానికి, రాహుల్‌ దింగ్రా (89784 52588) ముమ్మిడివరం, రామచంద్రపురం, మండపేట అసెంబ్లీ స్థానాలకు, సుమిత్‌ దాస్‌ గుప్తా (73308 62588) రాజోలు, పి.గన్నవరం, అమలాపురం అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల వ్యయాలనుపర్యవేక్షిస్తారు.

 
Advertisement
 
Advertisement