వరద తగ్గింది.. వర్షం పెరిగింది | - | Sakshi
Sakshi News home page

వరద తగ్గింది.. వర్షం పెరిగింది

Published Mon, Sep 9 2024 1:38 AM | Last Updated on Mon, Sep 9 2024 1:38 AM

వరద తగ్గింది.. వర్షం పెరిగింది

ముంపు నుంచి బయట పడుతున్న లంకలు

తెల్లవారు జాము నుంచి ఆగని వాన

సాక్షి, అమలాపురం: ఒకవైపు పోటెత్తిన గోదావరి శాంతిస్తుండగా.. మరోవైపు జిల్లాలో వర్షం పడుతూనే ఉంది. వరద తగ్గడంతో లంక గ్రామాల్లో కాజ్‌వేలు, ప్రధాన రోడ్లు ముంపు నుంచి బయట పడగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. జిల్లాలో గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద తగ్గుతూ వస్తోంది. ఉదయం ఏడు గంటలకు 6,56,642 క్యూసెక్కులుగా ఉన్న వరద ప్రవాహం, రాత్రి తొమ్మిది గంటల సమయంలో 4,64,844 క్యూసెక్కులుగా ఉంది. దీంతో దిగువన కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో వరద వీడుతోంది. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం ఎదురుబిడియం కాజ్‌వేపై వరద నీరు తగ్గింది. దీనితో అయినవిల్లిలంక, వీరవల్లిపాలెం, కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక గ్రామాలకు వాహనదారుల రాకపోకలకు మార్గం ఏర్పడింది. వృద్ధ గౌతమీ నదీపాయలో మాత్రం వరద ఉధృతి కొనసాగుతోంది. మామిడికుదురు మండలంలో వైనతేయ నదీపాయలో వరద తగ్గడంతో అప్పనపల్లి కాజ్‌వేపై నీరు వీడింది. అప్పనపల్లి, బి.దొడ్డవరం, పాశర్లపూడికి నేరుగా రాకపోకలు సాగిస్తున్నారు. అల్లవరం మండలం బోడసకుర్రు పల్లెపాలెంలోకి శుక్రవారం చొచ్చుకువచ్చిన వరద ఇప్పుడు తగ్గింది. ఇక్కడి మత్స్యకారుల ఇళ్లు ముంపు నుంచి బయటపడ్డాయి. కానీ వరద తెచ్చిన బురద రోడ్లపైకి చేరడంతో స్థానికులు నడిచి వెళ్లేందుకు సైతం ఇబ్బంది పడుతున్నారు. పి.గన్నవరం మండలంలో వరద వల్ల గంటి పెదపూడిలంక, ఊడిమూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాలకు, పశ్చిమ గోదావరి జిల్లా పరిధి కనకాయిలంక, అయోధ్యలంక, అనగారిలంక, శిర్రావారిలంక గ్రామాలకు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. మానేపల్లి శివారు శివాయిలంకను వరద వీడింది. ముమ్మిడివరం మండలం గురజాపులంకకు వెళ్లే సిమెంట్‌ రోడ్డు వరద ముంపు నుంచి బయటపడింది.

వర్షపాతం ఇలా...

వాయుగుండం ప్రభావంతో ఆదివారం తెల్లవారు జాము నుంచి ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. జిల్లాలో సగటున 7.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అధికంగా కొత్తపేటలో 15.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా అమలాపురంలో 2.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో సామాన్యులు ఇబ్బంది పడ్డారు. ఆలమూరులో 13.4, రావులపాలెంలో 13.2, మండపేట, రాయవరం 12, కపిలేశ్వరపురం 11.2, కె.గంగవరం 8.8, ఆత్రేయపురం 8.4, ముమ్మిడివరం 8.2, అయినవిల్లి 7, రాజోలు 6.2, రామచంద్రపురం 6, ఐ.పోలవరం 4.6, కాట్రేనికోన, మామిడికుదురు 4.2, అల్లవరం, పి.గన్నవరం 3.8, సఖినేటిపల్లి 3.4, ఉప్పలగుప్తం, అంబాజీపేట 3.2, మలికిపురం 3 మిల్లీమీటర్ల చొప్పున వర్షం పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement