హడలెత్తిస్తున్న చిరుత | - | Sakshi
Sakshi News home page

హడలెత్తిస్తున్న చిరుత

Published Mon, Sep 9 2024 1:38 AM | Last Updated on Mon, Sep 9 2024 1:38 AM

హడలెత్తిస్తున్న చిరుత

పుకార్ల వ్యాప్తితో మరింత ఆందోళన

తీవ్రంగా గాలిస్తున్న అటవీ సిబ్బంది

రాజానగరం: లాలాచెరువు, దివాన్‌చెరువు రిజర్వు ఫారెస్టు ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తోందనే ప్రచారం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. దీనికి తోడు అదిగో పులి అంటే ఇదిగో తోక అనే వారు చేసే పుకార్లతో లాలాచెరువు నుంచి రాజానగరం వరజు జనం బిక్కిబిక్కుమంటూ గడుపుతున్నారు. లాలాచెరువులోని గోదావరి మహాపుష్కర వనం సమీపంలో గురువారం రాత్రి చిరుతపులి ఒక జంతువును నోట కరుచుకుని అటవీ సిబ్బంది క్వార్టర్ల వైపు వెళ్లిందనే ఓ ప్రయాణికుని సమాచారం అటు అటవీ శాఖలోను, ఇటు ప్రజల్లోనూ అలజడి రేపింది. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు వాస్తవాలను తెలుసుకునే పనిలో పడ్డారు. శుక్రవారం రాత్రి అదే ప్రాంతంలో ఉన్న ఆకాశవాణి కేంద్రం సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో ఒక పందిని వెంబడిస్తూ చిరుత వెళ్లడం రికార్డవడంతో దాని సంచారం రూఢీ అయ్యింది. దీంతో పరిసరాలలోని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు పులిని త్వరగా పట్టుకునేలా జిల్లా అటవీ అధికారి భరిణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

జాతీయ రహదారిపై బిక్కుబిక్కుమంటూ..

చీకటి పడితేచాలు ఏ ఒక్కరూ ఒంటిరిగా బయటకు రావొద్దంటూ అటవీ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో లాలాచెరువు నుంచి దివాన్‌చెరువు వరకు ఉన్న జాతీయ రహదారిపై ప్రయాణించే వారు భీతిల్లుతున్నారు. లాలాచెరువు, దివాన్‌చెరువు ప్రాంతాల్లో జాతీయ రహదారిని ఆనుకుని 534.18 హెక్టార్లలో రిజర్వు ఫారెస్టు ఉండటంతో ఆ పరిసరాలలో నివసిస్తున్నవారు కూడా ఏ సమయాన ఏం జరుగుతుందోనని భీతిల్లుతున్నారు.

భయపెడుతున్న పుకార్లు

లాలాచెరువు, దివాన్‌చెరువు ప్రాంతాల్లో చిరుత సంచారం నేపథ్యంలో సోషల్‌ మీడియాలో పుకార్లు చురుగ్గా వ్యాపిస్తున్నాయి. గాయాలతో ఉన్న యువకుడి ఫొటో వేసి చిరుత దాడిలో గాయపడినట్టుగా కథ అల్లేశారు. అలాగే రాజానగరం శివారు సూర్యారావుపేటలో శనివారం రాత్రి చిరుత ఒక మేకను నోట కరుచుకుపోయిందంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వాస్తవాన్ని నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది.

ఎలా వచ్చింది!

సాధారణంగా జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు అడవి జంతువులు వచ్చేందుకు అవకాశం ఉండదు. కానీ ఈ చిరుతపులి జన సాంద్రత అధికంగా ఉండే లాలాచెరువు, దివాన్‌చెరువు ప్రాంతాలకు ఎలావచ్చిందనేది చర్చనీయాంశమైంది. రిజర్వు ఫారెస్టు ఉండటం వల్ల వచ్చి ఉండవచ్చని, అది కూడా అడ్డతీగల ప్రాంతం నుంచి మల్లిసాల మీదుగా ఇవి రావడానికి అవకాశాలున్నాయనే వాదన కూడా వినిపిస్తుంది. అంతేకాక గతంలో 2008, 2011, 2018లలో మూడు పర్యాయాలు రాజమండ్రిలో చిరుతపులులు సంచరించి, జనాన్ని హడలెత్తించాయంటున్నారు.

నగర వనం తాత్కాలికంగా మూసివేత

చిరుతపులి పట్టుకునే వరకు గోదావరి మహాపుష్కర నగర వనాన్ని 16వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా అటవీశాఖ అధికారి భరణి ఆదివారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. చిరుత సంచారంపై పరిసర గ్రామాలలోని ప్రజలను చైతన్యపరుస్తూ కరపత్రాలను విస్తృతంగా పంచామన్నారు. అలాగే చిరుత జాడ తెలుసుకుని త్వరగా పట్టుకునేలా అది సంచరించేందుకు అవకాశం ఉందనే ప్రాంతాలలో 50 ట్రాప్‌ కెమోరాలను అమర్చి, నాలుగు ట్రాప్‌ బోన్లను అమర్చామన్నారు. ఆకాశవాణి కేంద్రం, ఆటోనగర్‌ ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్టుగా తెలిసిందన్నారు. ఇంతవరకు అది ఎవరిపైనా దాడి చేయలేదన్నారు. రిజర్వు ఫారెస్టు పరిసరాలలో ఉంటున్న ఇళ్ల చుట్ట్టూ చీకటి వలయాలను ఉంచకుండా వెలుగులు ఉండేలా లైట్లు వేసి ఉంచాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement