రక్షణను చేజేతులా నరికేసి.. | - | Sakshi
Sakshi News home page

రక్షణను చేజేతులా నరికేసి..

Published Fri, Oct 11 2024 2:30 AM | Last Updated on Fri, Oct 11 2024 2:30 AM

రక్షణ

సరుగుడు తోటలను తొలగించి ఆక్వా సాగు

తీరానికి ముంచుకొస్తున్న భారీ కోత

అల్లవరం: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.. ఇది కాస్త తీర ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. అలాంటి సమయంలో తీర ప్రాంతాన్ని సముద్ర కోత నుంచి కాపాడే రక్షణ కవచాలే సరుగుడు తోటలు. ప్రకృతి వైపరీత్యాల నుంచి తీర ప్రాంతాన్ని కాపాడుకునేందుకు దశాబ్దాల క్రితమే ఈ తోటలను ఏర్పాటు చేశారు. ఇవి సముద్రం నుంచి వచ్చే బలమైన గాలుల తీవ్రతను తగ్గించి నష్టాన్ని నివారించడం, పంటలను ఉప్పు గాలి నుంచి కాపాడడం చేస్తున్నాయి. ఈ తోటలపై తీర ప్రాంత వాసులు ఆదాయం కూడా పొందేవారు. కాలక్రమేణా తోటలు గిట్టుబాటు కాక వాటి స్థానంలో ఆక్వా సాగుకు తెర తీశారు.

జిల్లాలోని ఏడు మండలాల్లో 45 కిలోమీటర్ల పొడవున తీర ప్రాంతం విస్తరించి ఉంది. దీనికి రక్షణగా 1,200 హెక్టార్ల విస్తీర్ణంలో ప్రభుత్వ భూముల్లో సరుగుడు తోటలు ఉన్నాయి. ఇవి కాకుండా తీరం పొడవునా జిరాయితీ భూముల్లో వందలాది మంది రైతులు సరుగుడు తోటలను సాగు చేశారు. రెండు దశాబ్దాల కిందటి వరకూ ఈ తోటలు తీరానికి ఆభరణంగా ఉండేవి. అయితే తోటలపై ఆదాయం రావడానికి ఎనిమిది నుంచి పదేళ్ల సమయం పట్టే అవకాశం ఉండడంతో గిట్టుబాటు కావని, ఆక్వా వైపు దృష్టి సారించారు. తీరం పొడవునా ఈ తోటలను అడ్డుగోలుగా నరికి, వాటి స్థానంలో ఆక్వా చెరువులను తవ్వేశారు. సరుగుడు సాగుతో పదేళ్లయినా రాని ఆదాయం ఆక్వాతో నాలుగు నెలలకే వస్తుందని చెరువులను అడ్డుగోలుగా ఏర్పాటు చేశారు. తీరానికి రక్షణగా ఉన్న సరుగుడు తోటలను తొలగించడంతో వేరు వ్యవస్థ కనుమరుగై ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో భారీ కెరటాలకు తీరం కోతకు గురవుతోంది. 2004లో సునామీ వచ్చినప్పుడు తీరం పొడవునా సరుగుడు తోటలు విస్తరించి ఉన్నాయి. సునామీ తర్వాత తీరం భారీగా కోతకు గురవుతూ వస్తోంది. తీరంలో తోటల విస్తీర్ణం నానాటికీ తగ్గిపోవడంతో సముద్రం నుంచి వీచే ఉప్పు గాలితో పంటలపై తీవ్ర ప్రభావం పడింది. తీర ప్రాంత మండలాల్లో వరి తర్వాత ఎక్కువగా పండించే కొబ్బరి పంట దిగుబడి బాగా తగ్గటానికి కారణమైంది.

చెరువులను తవ్వేసి..

జిల్లాలో తీర ప్రాంత మండలాలైన కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, ఐ.పోలవరంలలో సముద్ర తీరం పొడవునా విస్తరించి ఉన్న సరుగుడు తోటలను ధ్వంసం చేసి వాటి స్థానంలో చెరువులను తవ్వేశారు. దీనివల్ల సముద్రం నానాటికీ ముందుకు వస్తూ వేలాది ఎకరాల భూమిని తనలో కలిపేసుకుంది. రానున్న రోజుల్లో తీర ప్రాంత గ్రామాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికై నా ప్రభుత్వాలు, అధికారులు స్పందించి తీరానికి రక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది.

ఓడలరేవులో భారీ కెరటాల తాకిడికి కోతకు గురైన తీరం

ఆసక్తి చూపడం లేదు

కొమరగిరిపట్నం శివారు సముద్ర తీర ప్రాంతంలో ఆల్‌ క్యాస్ట్‌ సంఘం పేరిట 170 ఎకరాల్లో సరుగుడు తోటలను పెంచేవారు. సునామీ తర్వాత 70 ఎకరాల తోట సముద్ర గర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు వంద ఎకరాల్లో మాత్రమే ఉంది. సరుగుడుపై ఆదాయం పదేళ్ల వరకూ రాదు. దీంతో చాలామంది రైతులు ఆసక్తి చూపడం లేదు.

– పెచ్చెట్టి వెంకటేశ్వరరావు, కొమరగిరిపట్నం, అల్లవరం మండలం

సరుగుడు తోటలకు నష్టం

జిల్లా వ్యాప్తంగా 1,200 హెక్టార్ల విస్తీర్ణంలో సరుగుడు తోటలు విస్తరించి ఉన్నాయి. అల్లవరం మండలం ఓడలరేవులోనే ఎక్కువ మేర తీరం కోతకు గురవుతోంది. తీరంలో కోత నివారణకు సరుగుడు తోటలతో పాటు తాటి చెట్లు, చిత్తడి నేలలు ఉన్న ప్రాంతాల్లో మడ అడవులను పెంచాలి.

– ప్రసాదరావు, జిల్లా అటవీశాఖాఽధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
రక్షణను చేజేతులా నరికేసి..1
1/3

రక్షణను చేజేతులా నరికేసి..

రక్షణను చేజేతులా నరికేసి..2
2/3

రక్షణను చేజేతులా నరికేసి..

రక్షణను చేజేతులా నరికేసి..3
3/3

రక్షణను చేజేతులా నరికేసి..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement