మొగటికే మోసం..
● కూనవరం మొగ డ్రెడ్జింగ్‌కు హడావుడి
● డ్రెడ్జర్లను తీసుకొచ్చినా ఇంకా
మొదలు కాని తవ్వకాలు
● వర్షాలొస్తే చేలు మునిగిపోతాయని రైతుల ఆందోళన
సాక్షి, అమలాపురం/ ఉప్పలగుప్తం: చేసేది గోరంత.. హడావుడి మాత్రం కొండంత అన్నట్టు ప్రభుత్వ తీరు ఉంది. చంద్రబాబు పాలనలో పని చేసేది తక్కువైనా, ప్రచారం మాత్రం మహా గొప్పగా ఉంటోంది. తరచూ మూసుకుపోతున్న కూనవరం మొగ (స్ట్రైట్ కట్)ను డ్రెడ్జింగ్ చేసి తెరిపిస్తామని ప్రభుత్వం హామీలు గుప్పించింది. ఇందుకు అనుగుణంగా డ్రెడ్జర్లను సైతం ఆఘమేఘాలపై రప్పించింది. కానీ ఇంత వరకూ డ్రెడ్జింగ్ చేసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఈశాన్య రుతు పవనాలతో భారీ వర్షాలు కురిస్తే ముంపు నీరు దిగే అవకాశం లేక రైతులు మరింత నష్టపోయే పరిస్థితి తలెత్తనుంది.
ఏడాదికి మూడు పంటలు పండే మధ్య డెల్టాలో ఖరీఫ్ వరి సాగు జూదంగా మారింది. మురుగునీటి కాలువల వ్యవస్థ అధ్వానంగా మారడమే అందుకు కారణం. ఇలా జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో రైతులు ఖరీఫ్ సాగు వదిలేస్తున్నారు. కొంతమంది రైతులు సాగు చేస్తున్నా వర్షాలకు చేలు ముంపుబారిన పడి నష్టపోవడం పరిపాటిగా మారింది. జిల్లా అంతా ఇదే పరిస్థితి ఉన్నా నాలుగు మండలాలకు చెందిన సుమారు 25 వేల ఎకరాల ముంపునీరు దిగే కూనవరం మేజర్ డ్రైన్ అధ్వానంగా మరింది. కబ్జాలు, పూడుకుపోవడంతో పాటు ముంపునీరు సముద్రంలో దిగేచోట ఉన్న మొగ ఇసుకతో పూడుకుపోయింది. సహజ సిద్ధంగా తెరుచుకోవడం, మూసుకుపోవడం ఈ మొగ లక్షణం. దీనికి శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉండగా, ఏటా తాత్కాలికంగా మొగ తవ్వకాలు చేసి వదిలేస్తున్నారు. ఈ ఏడాది కూడా మొగ మూసుకుపోవడం, తెరిచే ప్రయత్నాలు విఫలం కావడం జరిగింది. జూలై నెలాఖరులో కురిసిన భారీ వర్షాలతో చాలా వరకూ చేలు ముంపుబారిన పడ్డాయి. రైతుల నారుమళ్లు రెండుసార్లు దెబ్బతినడంతో చాలా మంది సాగుకు స్వస్తి చెప్పారు. రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో డ్రెయిన్స్ అధికారులు మొగను గత ఆగస్టు 14న తెరవడంతో ముంపునీరు సముద్రంలోకి వెళ్లింది. అయితే మొగ అదే నెల 19న పూడుకుపోవడం గమనార్హం. వర్షాలు లేని సమయంలో మొగ తవ్వకాలు చేయడంతో డ్రెయిన్ నుంచి నీరు వేగంగా సముద్రంలో కలిసే అవకాశం లేకుండా పోయింది. దీనికితోడు సముద్ర కెరటాలతో మొగలో ఇప్పుడు మూడు, నాలుగు అడుగుల ఎత్తున మేటలు వేయడంతో అధికారులు ఖంగుతిన్నారు.
రెండు నెలలు.. కదలని పనులు
రైతుల ఆందోళనల నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి చెందిన స్థానిక నేతలు, అధికారులు వచ్చి వాలిపోయారు. ఆఘమేఘాల మీద మొగ తవ్వకాలు చేస్తామని హామీలు గుప్పించారు. వారు చెప్పిందే తడువుగా ఒక కాంట్రాక్టర్ రెండు డ్రెడ్జర్లను తీసుకువచ్చి కూనవరం డ్రెయిన్‌లో అందుబాటులో ఉంచారు. తవ్వకాలకు డిపార్ట్‌మెంట్ పరంగా అనుమతులు లేవు. నిధులు కేటాయింపు లేదు. కాని మొగ వెంటనే తవ్వకాలు చేస్తున్నట్టు మాత్రం బిల్డప్ ఇచ్చారు. తమ ప్రభుత్వం తలుచుకుంటే పనులు ఇంత వేగంగా సాగుతాయని మాత్రం చెప్పుకొచ్చారు. రెండు నెలలు కావస్తున్నా తవ్వకాలు మాత్రం చేపట్టలేదు. గత సెప్టెంబరులో వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు చేలు మరోసారి మునిగిపోయాయి. నష్టపోయిన చేలు నష్టపోగా, బతికి బట్టకట్టిన చోట దిగుబడి తక్కువగా వస్తోందని రైతులు వాపోతున్నారు.
అసలు కూనవరం మొగ తవ్వకాలకు చమురు సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్‌ఆర్) నుంచి నిధులు మంజూరు చేయించాలని స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తదితరులు పట్టుబట్టినా తాము ఇవ్వలేమని ఆ సంస్థ చేతులు ఎత్తివేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత డ్రెయిన్లలో పూడికతీత పనులకు నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో ఈ పనులు చేసే అవకాశం లేకపోవడంతో కూనవరం కాలువల్లో డ్రెడ్జర్లు పని లేకుండా పడిఉన్నాయి. గడిచిన రెండు నెలలుగా మొగ తవ్వకం పనులు చేపట్టకపోవడంపై ఆయకట్టు రైతులు మండిపడుతున్నారు. అధికారుల తీరు చూస్తుంటే రబీ నాటికి కాని ఇక్కడ పనులు పూర్తయ్యే అవకాశం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుడు చేసినా ఫలితం ఉండదని, కేవలం ఆక్వా రైతులకు మాత్రమే ప్రయోజనం కలుగుతోందని వారంటున్నారు. పైగా రబీ సమయంలో డ్రెయిన్ల ద్వారా ముంపునీరు వేగంగా ప్రవహించే అవకాశం లేనందున మొగ మరోసారి మూసుకుపోతోందని ఆయకట్టు రైతులు చెబుతున్నారు.
భారీ వర్షాలు కురిస్తే నష్టం
ఈశాన్య రుతుపవనాల వల్ల భారీ వర్షాలు కురిస్తే మిగిలిన ఖరీఫ్ చేలు కూడా ముంపు బారిన పడి నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో డ్రెడ్జింగ్ చేస్తే మంచిదని చాలా మంది రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో డ్రెడ్జింగ్ వల్ల నష్టపోతామని మరి కొంతమంది రైతులు ఆందోళన చేస్తుండడం విశేషం.
కూనవరం మేజర్ డ్రెయిన్‌లో డ్రెడ్జర్లు
ప్రతి సీజన్‌లోనూ నష్టం
కూనవరం మేజర్ డ్రెయిన్ తవ్వకాలు చేపట్టకపోవడంతో ప్రతి సీజన్‌లో వరి సాగు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఖరీఫ్ మెదలు పెట్టే దశలో అధికారులు మొగను తవ్విస్తున్నామని ప్రచారం చెయ్యటంతో ఖరీఫ్ సాగు చేపట్టాం. ఇంతలో వచ్చిన వరదలు, వర్షాలకు వరి చేలలో నీరు దిగక పంట పూర్తిగా కుళ్లిపోయింది. ప్రస్తుతం డ్రెడ్జింగ్ పనులు చేయిస్తున్నామని డ్రెడ్జర్ తీసుకుని వచ్చి రెండు నెలలుగా హంగామా చేస్తున్నా నేటికి తవ్వకాలు పూర్తి కాలేదు. ఇలానే కొనసాగితే రబీ సాగు చేయడానికి రైతు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలి.
– యాళ్ల లక్ష్మీనారాయణ, రైతు, భీమనపల్లి, ఉప్పలగుప్తం మండలం
సమయానికి తవ్వకాలు జరపలేదు
నేను మూడున్నర ఎకరాల్లో వరి, 12 ఎకరాల్లో కౌలు సాగు చేస్తున్నాను. ఖరీఫ్ సాగు చేపట్టిన వెంటనే కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన నీటికి మా వరి పొలాలు నీట మునిగి తీవ్రంగా పంట నష్టపోయాం. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.96 లక్షలతో రంగరాజుకోడు తవ్వకాలు చేపట్టింది. అయినప్పటికీ కూనవరం మేజర్ డ్రెయిన్ తవ్వకాలు ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల చేపట్టినా సమయానుకూలంగా చేపట్టకపోవడంతో పంటలు తీవ్రంగా నష్టపోతున్నాం. వెంటనే డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించాలి.
– మారిశెట్టి నరేష్, రైతు, గొల్లవిల్లి, ఉప్పలగుప్తం మండలం
Comments
Please login to add a commentAdd a comment