విజ్ఞాన కౌశలానికి పట్టం
రాయవరం: విద్యార్థులలో ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు కౌశల్ క్విజ్ పోటీలు ఎంతో ఉపకరిస్తాయి. భారతీయ విజ్ఞాన మండలి (బీవీఎం), ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి (ఆప్‌కాస్ట్) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో కౌశల్ సైన్స్ క్విజ్ పోటీలతో పాటు, పోస్టర్ పోటీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నిర్వహిస్తున్న ఈ పోటీలకు శతశాతం పాఠశాలలు నమోదు కావాల్సి ఉంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 232 ఉండగా, గురువారం సాయంత్రానికి 188 పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. మిగిలిన 44 శుక్రవారం సాయంత్రంలోగా రిజిస్టర్ కావాల్సి ఉంది.
మూడు దశల్లో పోటీలు
8, 9, 10వ తరగతి విద్యార్థులకు మూడు దశల్లో నిర్వహించే పోటీల్లో ప్రతి పాఠశాల నుంచి 15 మంది విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉంది. ప్రిలిమినరీ తర్వాత వారికి కోరుకున్న క్విజ్ లేదా పోస్టర్ ప్రజెంటేషన్, రీల్స్ ప్రజంటేషన్ చేసుకోవచ్చు. 8, 9 తరగతుల విద్యార్థులకు పోస్టర్ ప్రజంటేషన్, పదో తరగతి విద్యార్థులకు రీల్స్ చేసుకోవచ్చు. ఆయా జట్లను ఆన్‌లైన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఇందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీవీఎంఏ.పీఓర్‌జీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేస్తారు. కాగా పాఠశాల, జిల్లా స్థాయి పోటీలను ఆన్‌లైన్‌లో, రాష్ట్ర స్థాయి పోటీలను ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు. రాష్ట్రస్థాయి పోటీలను డిసెంబర్ 29, 30 తేదీల్లో విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో నిర్వహిస్తారు.
సిలబస్ ఇదీ..
గణితం, విజ్ఞానశాస్త్రం, సాంఘిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ శాస్త్రవేత్తల కృషికి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన సిలబస్ పరిధిలో అంశాలపై పట్టు ఉండాల్సి ఉంటుంది.
బహుమతులు ఇలా
జిల్లా స్థాయి విజేతలకు సర్టిఫికెట్, జ్ఞాపికతో పాటు ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి రూ.4,500, రూ.3,000 అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో రూ.15 వేలు, రూ.12 వేలు, రూ.9 వేలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తారు. వీరికి ప్రోత్సాహక బహుమతులుగా రూ.6 వేల చొప్పున అందజేస్తారు. పోస్టర్ ప్రజంటేషన్ పోటీల్లో పోస్టర్–1 పోటీల్లో జనరల్ అంశంపై 8వ తరగతి విద్యార్థులు ఇద్దరు మాత్రమే పాల్గొంటారు. పోస్టర్–2 పోటీల్లో విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయుల కృషిపై 9వ తరగతి విద్యార్థులు ఇద్దరు మాత్రమే పాల్గొంటారు. ఈ పోటీల్లో జిల్లా స్థాయిలో నిలిచిన వారికి రూ.1,500, రూ.1,000 నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. రాష్ట్ర స్థాయి విజేతలకు మొదటి మూడు బహుమతులుగా రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు, ప్రశంసాపత్రాలు అందజేస్తారు.
వైజ్ఞానిక లఘుచిత్ర పోటీలు
సులభ సూత్రాలను ఉపయోగించి రూట్ 2 విలువలు కనుగొనడం, ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞుల పరిశోధనలు (17వ శతాబ్దానికి పూర్వం). ఈ పోటీలకు పదో తరగతి నుంచి ఇరువురు విద్యార్థులు మాత్రమే నమోదు కావాలి.
క్విజ్ పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం
నేటితో ముగియనున్న గడువు
Comments
Please login to add a commentAdd a comment