నేడు సత్యదేవుని గిరి ప్రదక్షిణ
అన్నవరం : కార్తిక పౌర్ణిమ పర్వదినం సందర్భంగా శుక్రవారం సత్యదేవుని గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఏటా భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున కొండదిగువన ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో ఈసారి రెండుసార్లు గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం ఎనిమిది నుంచి 11 గంటల వరకు స్వామివారి పల్లకీ మీద, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్వామివారి ప్రచార రథం మీద గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు. భక్తులు రెండు కార్యక్రమాలలో పాల్గొనవచ్చు.
ఆరు గంటలకు పంచ హారతులు,
ఏడు గంటలకు జ్వాలాతోరణం
సాయంత్రం ఆరు గంటలకు పంపా నది వద్ద తెప్పోత్సవ పంటుపై పంపా నదీ హారతుల కార్యక్రమం నిర్వహించనున్నారు. సత్యదేవునికి పూజలు చేసిన అనంతరం అర్చక స్వాములు పంపా నదికి చీర, సారె సమర్పిస్తారు. తరువాత పంపా నదికి పంచ హారతులు సమర్పించి వాటిని ఒడ్డున గల భక్తులకు చూపిస్తారు. రాత్రి ఏడు గంటలకు తొలిపావంచా వద్ద సత్య దేవుని జ్వాలాతోరణం నిర్వహించనున్నారు. లక్షకు పైగా భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉందన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు.
తొలిపాంచా నుంచి రత్నగిరి,
సత్యగిరిల మీదుగా పవర్‌హౌస్ వరకు...
శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో తొలిపాంచా వద్దకు ఊరేగింపుగా తీసుకువస్తారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ రామచంద్రమోహన్ కొబ్బరికాయ కొట్టి గిరిప్రదక్షిణ ప్రారంభిస్తారు. తొలిపాంచా నుంచి వేలాది మంది భక్తులు వెంట రాగా సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా సుబ్బరాయపురం, మెయిన్‌రోడ్డు ద్వారా బెండపూడి సమీపంలోని పుష్కర కాల్వ వద్దకు చేర్చుతారు. అక్కడ బెండపూడి గ్రామస్తులు స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి పుష్కర కాల్వ పక్క నుంచి నడుస్తూ రత్నగిరి, సత్యగిరి కొండలను తొలిచి నూతనంగా నిర్మించిన రోడ్డు ద్వారా ఉదయం 11 గంటలకు పంపా తీరానికి సత్యదేవుని పల్లకీ చేరుకుంటుంది. మార్గ మధ్యలో రెండు చోట్ల స్వామి, అమ్మవార్లు విడిది చేస్తారు. అక్కడ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పంపా తీరానికి చేరిన స్వామి, అమ్మవార్లకు అక్కడ మంటపంలో పూజలు చేసిన అనంతరం తిరిగి రత్నగిరికి చేరుస్తారు. మధ్యాహ్నం జరిగే గిరి ప్రదక్షిణలో సత్యరథంపై స్వామి, అమ్మవారిని ఊరేగిస్తారు. భక్తులకు ఐదు చోట్ల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పాలు, పండ్లు, మజ్జిగ, పులిహోర పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. దేవస్థానం ఈఓ రామచంద్రమోహన్ గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. భక్తుల కాళ్లు కాలకుండా గిరిప్రదక్షిణ రోడ్డును నీటితో తడపాలని సిబ్బందిని ఆదేశించారు.
ఉదయం ఎనిమిది గంటలకు పల్లకీ మీద
మధ్యాహ్నం రెండు గంటలకు
ప్రచార రథంపై కార్యక్రమం
Comments
Please login to add a commentAdd a comment