వెంకన్న ఆలయానికి అనధికార నియామకమా..?
అమలాపురం టౌన్: కోనసీమ పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన అమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయానికి స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆదేశాలతో ఇన్‌చార్జి చైర్మన్‌గా టీడీపీ నాయకుడు జంగా అబ్బాయి వెంకన్నను నియమితులయ్యారు. దేవదాయశాఖ పరిధిలో ఉండే దేవాలయాలకు ధర్మకర్తల మండళ్లు నియమించేందుకు ప్రభుత్వం నుంచి ముఖ్యంగా రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ నుంచి లిఖిత పూర్వక ఉత్తర్వులు రావాలి. అన్నింటికీ మించి ధర్మకర్తల మండలి నియామకానికి ముందు దేవదాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఇవన్నీ లేకుండా ఎమ్మెల్యే ఆనందరావు ఆదేశాలతో ఇన్‌చార్జి చైర్మన్‌గా అబ్బాయి వెంకన్నను నియమించడంపై దేవదాయ అధికారులు మౌనంగా ఉండిపోయారు. ఇదే ఆలయానికి కూటమి మిత్రపక్షాలైన జనసేన, బీజేపీకి చెందిన నాయకులతో మరో ఐదుగురిని కమిటీ సభ్యులుగా నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ముఖ్యంగా దేవదాయ శాఖ కమిషనర్ నుంచి ఇవే పేర్లతో ధర్మకర్తల మండలి నియామకం జరిగితే సరేసరి. నోటిఫికేషన్, వెరిఫికేషన్ లేకుండా నియామకాలు ఏం జరిగినా అవి అనధికార నియామకాలేనని ఆ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇచ్చిన ఆదేశాలతో ఆలయానికి ఇన్‌చార్జి చైర్మన్‌గా నియమించిన నియామకంపై దేవదాయశాఖ అధికారులెవరూ వివరణ ఇచ్చేందుకు సాహసించలేకపోతున్నారు. ప్రత్యేక సందర్భాల్లో ఆలయాల ఉత్సవ కమిటీలకు నియామకాలు చేయడం ఎమ్మెల్యేలకు అధికారం ఉంటుంది. అయితే ఆలయ ధర్మకర్తల మండళ్లకు (ట్రస్ట్ బోర్డులు) నియామకాలకు సంబంధించి ఎమ్మెల్యేలు సిఫార్సులు మాత్రమే చేస్తారు. నియామక ఉత్తర్వులను అధికారిక ప్రక్రియ ద్వారా రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ జారీ చేయాల్సి ఉంటుందని సంబంధిత శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆలయ చైర్మన్ పదవి కోసం కూటమి పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే ప్రసన్నం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment