భవిష్యత్‌ కథ కల్కి | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌ కథ కల్కి

Published Mon, Sep 9 2024 1:38 AM | Last Updated on Mon, Sep 9 2024 1:38 AM

భవిష్యత్‌ కథ కల్కి

సమన్వయ సరస్వతి సామవేదం

రాజమహేంద్రవరం రూరల్‌: కలిని అంతమొందించే కల్కి ఇంకా అవతరించలేదు. కల్కి కథ భవిష్యత్‌ కథ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. కొంతమూరులోని శ్రీవల్లభగణపతి మందిర ప్రాంగణంలోని ప్రవచన మందిరంలో ఆయన ఆదివారం కల్కి అవతార వైభవంపై ప్రసంగం కొనసాగించారు. కలి పురుషుడి విజృంభణ ప్రధానంగా కలియుగంలోనే కనపడుతుంది. అయితే, మిగతా యుగాల్లో కూడా కలి ప్రస్తావన ఉన్నదని సామవేదం అన్నారు. క్షీరసాగర మథన సమయంలో విష్ణువు అసురులలో పరస్పర కలహాలు కలగచేయడానికి కలి పురుషుడిని ఆహ్వానిస్తాడు. ఈ విద్యలో కలి సిద్ధహస్తుడు. కలి రాక్షస బుద్ధులను ఆవహించాడు. అలాగే నలదమయంతుల కథలో కూడా కలి ప్రస్తావన ఉంది. ధర్మవర్తనుడైన నల చక్రవర్తిలో ప్రవేశించడానికి కలి 12 ఏళ్లు ఎదురుచూశాడు. పాదప్రక్షాళన చేసుకోకుండా సంధ్యను ఉపాసించడానికి పూనుకున్న నలునిలో కలి ప్రవేశించగలిగాడని సామవేదం అన్నారు. కలి దోష నివారణకు చెప్పిన ఉపాయాలలో నలదమయంతుల స్మరణ ఒకటి. వ్యాసభగవానుని మహర్షులు ఒక మంచి మాట చెప్పమంటే, ఆయన కలిస్సాధుఃకలి మంచిదని అన్నాడు. మిగతా యుగాల్లో అత్యంత కఠినతరమైన తపోనియమాలు పాటిస్తే కానీ లభ్యం కాని ముక్తి, కలి యుగంలో నామస్మరణ మాత్రంచే లభిస్తుందని, కృతయుగంలో ఏడాది పాటు చేసే సాధన కలిలో ఒక్క రోజు సాధనతో సమానమని అన్నారు. కలౌనామస్మరణాన్ముక్తిః అన్నారు. పుణ్య కర్మలను, పుణ్య విధులను తలుచుకున్నా కలిలో ఫలితం లభిస్తుంది. కానీ మిగతా యుగాల్లో పుణ్మకర్మలు చేస్తేనే ఫలితం ఉంటుందని సామవేదం అన్నారు. ఈ యుగంలో కలి జూదం, మద్యం, సీ్త్ర, సువర్ణాలను ఆశ్రయించుకుని ఉంటాడని, ఇక్కడ సీ్త్ర అంటే సీ్త్ర వ్యసనం, అంతేకాని సీ్త్రలను చిన్నచూపు చూడటం కాదని, సనాతన ధర్మం సీ్త్రకి గౌరవం ఇచ్చిందన్నారు. అలాగే సువర్ణమంటే ధనలోభమని, మనం కలియుగం ప్రథమపాదంలో ఉన్నాం, ఒకో పాదం గడిచే కొద్దీ, కలి విజృంభణ మరింత పెరుగుతూ ఉంటుందని సామవేదం అన్నారు. ముందుగా భాగవత విరించి డాక్టర్‌ టీవీ నారాయణరావు స్వాగత వచనాలు పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement