నిబంధనల మేరకు ఇసుక సరఫరా
● ఆర్డీఓ శ్రీకర్
● మందపల్లి ర్యాంపు పరిశీలన
కొత్తపేట: మందపల్లి ర్యాంపులో నిబంధనల మేరకు ఇసుక సరఫరా చేయాలని ఆర్డీఓ పి.శ్రీకర్ ఆదేశించారు. స్థానిక వినియోగదారుల అవసరాల దృష్ట్యా ఇసుక ర్యాంపుల నుంచి ఇసుక తీసుకువెళ్లడానికి అధికారులు ఇచ్చిన అనుమతులను ఆసరాగా చేసుకుని అధికార పార్టీ నాయకులు ఇసుక అక్రమ తరలింపుపై ఈ నెల 14న ‘సాక్షి’ దినపత్రికలో ‘లోకల్ మాటున లూటీ’ శీర్షికన వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజులు మండల, గ్రామ స్థాయి అధికారులు ఇసుక సరఫరాను పర్యవేక్షించారు. శనివారం సాయంత్రం మందపల్లి ఇసుక ర్యాంపును ఆర్డీఓ శ్రీకర్ రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. అక్కడ పనిచేస్తున్న జట్టు కూలీలు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ర్యాంపు నుంచి ఇసుక కావాల్సిన వారు స్థానిక గ్రామ సచివాలయంలో తెలియజేసి, సాండ్ పోర్టల్ నందు జారీ చేస్తున్న రసీదు పొందిన తరువాత మాత్రమే ఇసుక తీసుకువెళ్లడానికి అనుమతించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ మార్గదర్శకాలు పాటిస్తూ ఇసుకను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ ర్యాంపును అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ వై.రాంబాబు, ఆర్‌ఐ పి.రవిశంకర్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉంటే సచివాలయాల రసీదులు లేకుండా, అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో వ్యాపారులు ఇసుక తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment