డీఎంహెచ్‌వో ఆంక్షలపై ఆశాల ఆగ్రహం
● ధర్నాలో ఉద్రిక్తత.. కలెక్టరేట్‌లోకి
దూసుకువెళ్లిన కార్యకర్తలు
● అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర వాగ్వాదం, తోపులాట
● ఆంక్షలు ఎత్తివేస్తానన్న జిల్లా వైద్యాధికారి హామీతో ఆందోళన విరమణ
అమలాపురం రూరల్: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ వద్ద చేపట్టిన భారీ నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం కలెక్టరేట్ వద్ద జిల్లావ్యాప్తంగా ఆశ వర్కర్లు ధర్నా చేపట్టారు. ఏ జిల్లాలో లేని విధంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆశాలు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పీహెచ్‌సీల్లోనే ఉండాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆంక్షలు విధించడంతో వాటిని తొలగించాలని ఆందోళన చేశారు. ఉదయం నుంచి ఆందోళన చేసినా ఎప్పటికీ జిల్లా వైద్య అధికారి కలెక్టరేట్ నుంచి బయటకు రాకపోవడంతో ఆగ్రహించిన ఆశ కార్యకర్తలు కలెక్టరేట్‌ను ముట్టడించారు. దీంతో కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఆశలు కలెక్టరేట్‌లోకి దూసుకు వెళ్లారు. కార్యకర్తలు గేట్లు తోసుకుని లోపలికి వచ్చి డీఎంఅండ్ హెచ్‌ఓ రావాలని నినాదాలు చేశారు. ఈ సమయంలో పట్టణ సీఐ వీరబాబు ఆధర్యంలో పోలీసులు ఆశ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన చేశామని ఆశ కార్యకర్తలు తెలిపారు. కనీస వేతనాలు చెల్లించాలి, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా ఆశ వర్కర్లను పరిగణించాలి, రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి, ప్రభుత్వ సెలవులు, మెటర్నిటీ లీవులు, మెడికల్ లీవులు ఇవ్వాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఇళ్లు లేని వారికి స్థలాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ నినాదాలు చేశారు. చివరకు యూనియన్ నాయకులు డీఎంహెచ్‌ఓ దుర్గారావు దొరతో ఫోన్‌లో మాట్లాడారు. సాయంత్రం నాలుగు గంటల వరకు పీహెచ్‌సీల్లోనే ఉండాలని తానిచ్చిన సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటానని ఆయన హామీ ఇవ్వడంతో ఆశాలు ఆందోళన విరమించారు. ఆశ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు ఎస్తేరు రాణి, జిల్లా గౌరవ అధ్యక్షురాలు కృష్ణవేణి, ఆశ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మలక సుభాషిణి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎ.దుర్గాప్రసాద్, నూకల బలరాం, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరావు, సీఐటీయూ ఉపాధ్యక్షుడు భాస్కరరావు, అంగన్‌వాడీ జిల్లా అధ్యక్షుడు బండి వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment