108 అంబులెన్స్ ఉద్యోగుల నిరశన
అమలాపురం రూరల్: 108 అంబులెన్స్ సర్వీస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద విధులలో లేని ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జిల్లా జనరల్ సెక్రటరీ పోతురాజు, కోశాధికారి చిట్టిబాబు మాట్లాడుతూ కొద్ది రోజులుగా శాంతియుతంగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వ అధికారులు సమస్యలు పరిష్కరించక పోవడంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 11వ తేదీన ప్రభుత్వ అధికారులకు, యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. ప్రభుత్వ అధికారులు, యాజమాన్యం స్పందించి సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో తప్పని పరిస్థితుల్లో 25 తేదీ నుంచి సమ్మె చేస్తామని తెలిపారు. ప్రజల అసౌకర్యానికి పూర్తి బాధ్యత ప్రభుత్వ అధికారులే వహించవలసి ఉంటుందని అన్నారు. 108 అంబులెన్స్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, బకాయిలను పూర్తిగా చెల్లించే బాధ్యత ప్రభుత్వమే చేపట్టాలని, 108 వ్యవస్థలో రోజుకు మూడు షిఫ్ట్‌లలో 8గంటల పనివిధానం అమలు చేయాలని కోరారు. సీఐటీయూసీ నాయకులు నూకల బలరాం, అంగన్‌వాడీ జిల్లా కోశాధికారి కృష్ణవేణి, ఎంఅర్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మద్దతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment