ఆందోళన చెందుతున్న స్థానికులు
అమలాపురం టౌన్: పిల్లలు దూర ప్రాంతాల్లో ఉంటున్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం.. అని హిందీలో మాట్లాడుతూ, అవతలి వారు మానసికంగా లొంగిపోయారని నిర్థారించుకున్న తరువాత డబ్బులు డిమాండ్ చేస్తూ సీబీఐ పేరుతో వస్తున్న ఫోన్‌కాల్స్ స్థానికంగా పలువురిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అటువంటి కాల్స్ రిసీవ్ చేసుకున్న వారు బెంబేలెత్తిపోయి దూర ప్రాంతాల్లో ఉన్న తమ పిల్లలకు సమాచారం ఇస్తున్నారు. ఇంకొందరు తమకు పరిచయమున్న పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నారు. ఫేక్ కాల్స్ మాట్లాడుతున్న సమయంలో ఎవరో మగ లేదా ఆడగొంతుతో ఆర్తనాదాలు వినిపిస్తుండడంతో ఇటువైపు మాట్లాడుతున్న వారు హడలిపోతున్నారు. స్థానికుడైన ఓ వ్యక్తికి మంగళవారం దాదాపు పది కాల్స్ రాగా ఫోన్‌లో అవతలి వ్యక్తి ఓ పేరు చెప్పి మీకేమవుతుందని అడగడం.. మా అన్న కూతురని ఇటునుంచి బదులు ఇవ్వడం.. వెంటనే అరెస్టు అంటూ పదేపదే చెప్పడంతో స్థానికుడు బెదిరిపోయారు. ఇలాగే పలువురికి ఫేక్ కాల్స్ వస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై పట్టణ సీఐ పి.వీరబాబుకు వివరించగా అవి ఫేక్ కాల్స్ అని, అటువంటి నంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని సూచించారు. సీబీఐ అధికారులు అరెస్టుకు వస్తే స్థానిక పోలీసుల సహకారంతో వస్తారని, ఇటువంటి బెదిరింపులకు పాల్పడరని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment