తెల్ల బంగారానికి నల్లరోజులు | - | Sakshi
Sakshi News home page

తెల్ల బంగారానికి నల్లరోజులు

Published Wed, Nov 20 2024 12:15 AM | Last Updated on Wed, Nov 20 2024 12:15 AM

తెల్ల

తెల్ల బంగారానికి నల్లరోజులు

అప్రమత్తంగా ఉండాలి

ప్రస్తుతం పత్తి పంటకు నష్టం కలిగించే తెగుళ్లు ఉన్నట్టుగా భావిస్తున్నాం. అయితే నష్టం దేనివల్ల జరుగుతోంది, ఎలా జరుగుతోందనే విషయాలు నిర్ధారించడానికి శాస్త్రవేత్తలను పిలిచాం. వారు వచ్చి పంటలు పరిశీలించి నిర్ధారిస్తారు. ఈలోపు రైతులు తొందరపడి పంటను నరికేసుకోవద్దు. కొందరు రైతులు తొందరపడుతున్నారు. నష్టం జరిగినప్పుడు వివరాలు తెలుసుకోకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇప్పటి నుంచీ జాగ్రత్తలు పాటించడం వల్ల కొంతవరకూ నష్టం నివారించుకోవచ్చు. అందుకే ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించడానికి ఏరువాక శాస్త్రవేత్తల ద్వారా సదస్సుల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. ప్రస్తుతం నష్టం వాటిల్లుతున్న పంటకు వ్యవసాయ శాఖ సూచనల ప్రకారం సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి.

– స్వాతి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌,

వ్యవసాయ శాఖ, పిఠాపురం

పిఠాపురం: ఇటీవల వచ్చిన వరదల నుంచి తేరుకుంటున్న పత్తి రైతును తెగుళ్లు, నాసిరకం విత్తనాలు నట్టేట ముంచాయి. పండిన పంట పనికి రాకుండా పోతూండటంతో చేసేదేమీ లేక ఆరుగాలం పండించిన పంటను రైతులు తమ చేతులతో తామే నరికేస్తున్నారు. కాయ కాసినా పత్తి వచ్చే సమయానికి అది పగలకపోవడంతో దిగుబడి లేక తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాంగ్‌ఫుల్‌ కాటన్‌, మీడియం స్టేఫుల్‌ కాటన్‌, పొట్టి స్టేఫుల్‌ కాటన్‌ అనే మూడు పత్తి రకాలను ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడలో సుమారు 400 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా 200 ఎకరాల్లో పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతు చిక్కని తెగుళ్లు, నాసిరకం విత్తనాల వల్లే ఇలా జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. అధికారుల ద్వారా వచ్చిన విత్తనాల్లో నాసిరకం ఉండవచ్చని రైతులు అంటున్నారు. అయితే, వారి ఆరోపణలను అధికారులు కొట్టి పారేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి జిల్లాలో పత్తి పంటకు ప్రమాదం పొంచి ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కూలి డబ్బు కూడా రాని దుస్థితి

జిల్లాలోని గొల్లప్రోలు, జగ్గంపేట, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరంతో పాటు తూర్పు గోదావరి జిల్లా రంగంపేట తదితర మండలాల్లో సుమారు 11,850 ఎకరాల్లో పత్తి సాగు జరుగుతోంది. పత్తి పంటకు సాధారణంగా కాయ తొలుచు పురుగు సోకడం, దాని నివారణకు మందులు పిచికారీ చేయడం జరిగేది. కొన్నేళ్ల క్రితం వరకూ గులాబీ రంగు కాయ తొలుచు పురుగు (పింక్‌బాల్‌ వార్మ్‌) పత్తి పంటకు తీవ్ర నష్టం కలిగించేది. వివిధ రకాల మందులు పిచికారీ చేయడం ద్వారా దీనిని పూర్తిగా నివారించగలిగారు. అప్పటి నుంచీ దాని ప్రభావం తగ్గి రైతులకు దిగుబడి ఆశాజనకంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జిల్లాలో గొల్లప్రోలు మండలంలో పత్తి పంట కాయ కాసినా అది పగిలి పత్తి రావాల్సి ఉండగా అలా జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి కోసే కూలీకి రోజుకు రూ.500 ఇవ్వాల్సి ఉండగా ఒక్కో కూలీ రోజుకు 10 నుంచి 20 కేజీల వరకూ పత్తి కోస్తూంటారు. కానీ ప్రస్తుతం కాయ పగిలి పత్తి రాకపోగా కోసేటప్పుడు కాయ నుంచి పత్తితో పాటు కాయ కూడా వస్తూండటం, పత్తి తక్కువగా రావడంతో ఒక్కో కూలీ రోజుకు రెండు కేజీలు కూడా కోయలేకపోతున్నారని రైతులు చెబుతున్నారు. దీంతో రూ.500 కూలీకి ఖర్చు చేస్తే రూ.110 విలువైన పత్తి మాత్రమే వస్తోందని, దీంతో కోయడం ఆపేసి పత్తి పంటను నరికేస్తున్నామని రైతులు చెబుతున్నారు.

భారీ నష్టమే

ఎకరానికి రూ.40 వేలు పెట్టుబడి పెట్టగా రూ.30 వేలు కౌలు ఇస్తున్నామని, ఇతర ఖర్చులు కలిపి ఎకరానికి రూ.80 వేల వరకూ పెట్టుబడి అవుతోందని, ప్రస్తుతం రూ.8 వేలు కూడా రాని పరిస్థితి ఎదురైందని రైతులు వాపోతున్నారు. ఒక్క గొల్లప్రోలు మండలంలోనే సుమారు 200 ఎకరాల వరకూ పత్తి పంట నష్టాల పాలవ్వడంతో రూ.1.60 కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.

పంట నరికించేస్తున్నాను

నేను ఒక ఎకరంలో పత్తి సాగు చేశాను. విత్తనాలు వేసే నాటి నుంచి చాలా జాగ్రత్తలు పాటించాను. కానీ పంట చేతికి వచ్చే సమయానికి అంతా మాయగా మారిపోయింది. పత్తి చేనులో కాయలు కనిపిస్తున్నాయి. కాని అవి పగలడం లేదు. పత్తి రావడం లేదు. ఎందుకిలా జరిగిందో అర్థం కావడం లేదు. విత్తనాల్లో తేడాలనుకుంటున్నాం. దీనికి తోడు పంటపై తెగుళ్లు ప్రభావం చూపించి ఉండవచ్చు. ఎకరానికి రూ.80 వేల పెట్టుబడి పోయింది. చేసేదేమీ లేక ఉన్న పంటను కూలీలను పెట్టి నరికించాల్సి వచ్చింది. విత్తనాలపై అధికారులు విచారణ చేయాలి. తెగుళ్లను నిర్ధారించాలి. ఏం చేసినా ఈ పంట మాకు లేనట్టే. ప్రభుత్వం ఆదుకోవాలి.

– వెలుగుల సత్యనారాయణ, పత్తి రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం

ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలి

నేను రెండు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాను. పత్తి కాయలు పేలకపోవడంతో పంటను నరికేస్తున్నా. ఈ పంట పోయినట్టే. రెండో పంట కోసం భూమిని సిద్ధం చేసుకోడానికి ఉన్న పత్తి పంటను నరికేస్తున్నాం. పెట్టుబడి రాకపోగా పంటను నరికించేందుకు తిరిగి పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. చేసేదేమీ లేక పండించిన పంటను మా చేతులతో మేమే నరుక్కుంటున్నాం. ఇకపై పత్తి సాగు చేయాలంటే భయం వేస్తోంది. మాకు జరిగిన నష్టంపై అధికారులు విచారణ జరపాలి. కారణం ఏమిటో తెలుసుకోవాలి. మాకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలి.

– మేడిబోయిన శివ, పత్తి రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం

జిల్లాలో పరిస్థితి ఇలా..

సాగు 11,850 ఎకరాల్లో

రైతులు 8,890 మంది

ఏటా దిగుబడి 2,13,300 క్వింటాళ్లు

రైతుకు వి‘పత్తి’

పత్తి పంటను తెగనరుకుతున్న వైనం

దిగుబడి దెబ్బతీస్తున్న తెగుళ్లు

కాయ పగలక పత్తి రాని పరిస్థితి

రైతును నట్టేట ముంచిన

నాసిరకం విత్తనాలు

No comments yet. Be the first to comment!
Add a comment
తెల్ల బంగారానికి నల్లరోజులు 1
1/4

తెల్ల బంగారానికి నల్లరోజులు

తెల్ల బంగారానికి నల్లరోజులు 2
2/4

తెల్ల బంగారానికి నల్లరోజులు

తెల్ల బంగారానికి నల్లరోజులు 3
3/4

తెల్ల బంగారానికి నల్లరోజులు

తెల్ల బంగారానికి నల్లరోజులు 4
4/4

తెల్ల బంగారానికి నల్లరోజులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement