కోటి ఆశలతో స్వాగతం
● జిల్లాలో అంబరాన్నంటిన
న్యూ ఇయర్ వేడుకలు
● ప్రభుత్వానికి మంచి చేయాలనే తలంపు రావాలని జనం..
● వ్యవసాయం బాగుండాలని రైతులు..
● ఉపాధి కల్పించాలని నిరుద్యోగులు..
● హామీలు నెరవేర్చాలని మహిళలు..
● వ్యాపారాలు గాడిన పడాలని
వ్యాపారస్తులు..
● సర్కారు సహకరించాలని
విద్యార్థుల ఆకాంక్ష
సాక్షి, అమలాపురం: ఏడాది ఇట్టే గడిచిపోయింది. 365 రోజులు గిర్రున తిరిగాయి. అర్ధరాత్రి గడియారంలో 11.59 గంటల తరువాత రెండుముళ్లూ ఒకేచోట చేతులు కలుపుకున్న వేళ... కోటి ఆశల కొత్త ఏడాది ఆరంభమైంది. నూతన సంవత్సరంలో తమ జీవితాలు ప్రభవించాలని జిల్లావాసులు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఉంటుందని, ఎవరో కొందరికి తప్ప జీవితాల్లో గొప్పగొప్ప మలుపులు.. మార్పులు రావని తెలిసినా సగటు మనిషిలో కొత్త ఏడాది కోటి ఆశలు రేకెత్తిస్తోంది. గతం తాలుకా చేదు జ్ఞాపకాల స్థానంలో తీపి రోజులు వస్తాయని నమ్మకాన్ని పెట్టుకుని కొత్త ఏడాది ప్రారంభించారు. శ్రీమంచి ప్రభుత్వంశ్రీ అనేది మాటల్లో కాదని.. చేతల్లో చూపాలని కూటమి ప్రభుత్వాన్ని జనం వేడుకుంటున్నారు. ఈ ఏడాదైనా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ అమలు చేయాలని లబ్ధిదారులు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.
జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త ఏడాదికి జనం స్వాగతం పలికారు. అర్ధరాత్రి 12 గంటలు అవగానే జిల్లా హ్యాపీ న్యూ ఇయర్ అనే నినాదాలతో హోరెత్తింది. బాణసంచా కాల్పులతో మోత మోగింది. సందుగొందులు సైతం బిర్యానీలు.. కోడి, మేక వేపుడుల మసాలాతో ఘుమఘుమలాడాయి. బొకేలు, కేకుల వ్యాపారం జోరుగా సాగింది. బొకేలతోపాటు కొత్తగా పింగాణి, ప్లాస్టిక్ కుండీలలో చిన్నచిన్న మొక్కలు ఇచ్చుకుని జనం శుభాక్షాంక్షలు చెప్పుకున్నారు. నూతన సంవత్సరం రాక సందర్భంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
వ్యాపారాలు గాడిన పడాలని..
గత ఏడాది రియల్ ఎస్టేట్‌తోపాటు పలు వ్యాపారాలు ఒడుదొడుకులకు లోనయ్యాయి. మనీ సర్క్యులేషన్ చాలా వరకు నిలిచిపోయింది. దీనివల్ల అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగలేదు. కొత్త సంవత్సరం వ్యాపార రంగం త్వరగా కోలుకుని పుర్వ వైభవం వైపు పరుగులు తీయాలన్నదే మా వ్యాపారస్తుల ఆకాంక్ష.
– కర్రి సుబ్బారెడ్డి, రావులపాలెం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి
ఉపాధి దొరకాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కొత్త ఏడాది ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. ఉద్యోగాలు కల్పించకపోతే నిరుద్యోగ భృతి క్రమం తప్పకుండా అందించాలి. కొత్త ఏడాది మా యువతకు మేలు జరగాలి. – కోటా రామ్‌కుమార్,
పోతాయిలంక, అంబాజీపేట
అందరికీ మంచి జరగాలి
జిల్లా వాసులందరికీ 2025 సంవత్సరంలో మంచి జరగాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ అందించాలనే లక్ష్యంతో కొత్త ఏడాది నాతోపాటు జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కలిసిగట్టుగా పనిచేస్తాం. జిల్లా వాసులు ఆయురారోగ్యాలు, సిరి సంపదలు పొందాలని కోరుకుంటున్నాను.
– ఆర్.మహేష్‌కుమార్, జిల్లా కలెక్టర్
ప్రభుత్వం దన్నుగా నిలబడాలి
మా మహిళా సంఘాలకు ప్రభుత్వం దన్నుగా నిలబడాలి. ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఉచిత బస్సు సర్వీసులు, నెలకు ఇస్తానన్న రూ.1.500 గత ఆరు నెలలుగా ఇవ్వాల్సిన సొమ్ము కూడా కలిపి ఇవ్వాలి. కొత్త ఏడాది మా మహిళలకు మంచి జరగాలని కోరుకుంటున్నాను.
– శీలం నాగమల్లేశ్వరి, మురమళ,
ఐ.పోలవరం మండలం
చేయూత అందించాలి
ప్రభుత్వం విద్యార్థులకు ఆర్థికంగా చేయూత అందించాలి. వివిధ రకాల పథకాల ద్వారా ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఫీజుల రీయింబర్స్‌మెంట్, తల్లికి వందనం, అధునాతన విద్యను అందుబాటులోకి తీసుకురావాలి. ఉద్యోగ, ఉపాధి కల్పించే విద్యాబోధనకు పెద్ద పీట వేయాలి. – పి.వెన్నెల,
ఇంటర్ హెచ్‌ఈసీ, రాయవరం
ముంచే ప్రభుత్వం కారాదు
కొత్త ఏడాదైనా కూటమి ప్రభుత్వానికి పేదలు, సామాన్యులకు మేలు చేయాలనే తలంపు రావాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు. మాది శ్రీమంచి ప్రభుత్వంశ్రీ అని చెప్పుకుంటూ గత ఏడాది ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా శ్రీముంచే ప్రభుత్వంశ్రీగా కూటమి సర్కారు ముద్ర వేసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్‌తోపాటు మరెన్నో హామీలను నెరవేర్చాలని రైతులు, నిరుద్యోగులు,వ్యాపారులు, మహిళలు, విద్యార్థులు కోరుకుంటున్నారు. గత ఏడాది జిల్లాలో వివిధ రంగాలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ఆయా రంగాలు కోలుకోవాలని, పూర్వ వైభవం సంతరించుకోవాలని కోరుకుంటున్నారు. ఇందుకు ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంతోపాటు పలు రంగాల పురోగతికి చేయూతనివ్వాలని కోరుకుంటున్నారు.
రైతుకు న్యాయం చేస్తారని...
2024 సంవత్సరం రైతులకు చేదు ఫలితాలే చూపించాయి. ఖరీఫ్‌లో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. ప్రభుత్వం ఇస్తానన్న రూ.20వేల పెట్టుబడి సాయం ఇవ్వలేదు. వర్షాలకు పంటలు దెబ్బతిన్నా పరిహారం అందించలేదు. రబీ సాగుకు ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా రూ.20వేలు పెట్టుబడి ప్రోత్సాహం అందించాలి. ఉచిత పంటల బీమా అందించాలి. –బద్రి వెంకటేశ్వరరావు, రైతు,
చినగాడవల్లి, ఉప్పలగుప్తం మండలం
Comments
Please login to add a commentAdd a comment