తొండంగి: నిశి వేళలో... కళ్లెం లేని వేగం ఉసురు తీసింది.. నిండు ప్రాణాలను నింగిలో కలిపేసింది.. ఆ దారిలో మృత్యుకేళి మోగించింది.. అయినవారికి విషాదం మిగిల్చింది.. అతివేగం ఆపై నిద్రమత్తు కారణంగా టిప్పర్ తొండంగి మండలం ఎ.కొత్తపల్లిలో వినాయకుని ఆలయంలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృత్యువాత పడిన సంఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రౌతులపూడి మండలం నుంచి తొండంగి మండలం తీర ప్రాంతానికి టిప్పర్ వెళ్తుంది.
అది అన్నవరం నుంచి తొండంగి వైపు వస్తుండగా ఎ.కొత్తపల్లిలో వేగంగా వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న జీఎస్‌ఎల్‌ఆర్ ట్యాంకును ఢీకొట్టింది. వెంటనే ఎదురుగా ఉన్న వినాయకుని ఆలయంలోకి దూసుకెళ్లింది. టిప్పర్ వేగానికి వినాయకుని ఆలయం పూర్తిగా నేలమట్టల అయ్యింది. లారీ క్యాబిన్ నుజ్జునుజ్జ అయ్యింది. ఈ ఘటనతో గజ్జనపూడి గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ చుక్కల శేఖర్ (28), క్లీనర్ కానూరి సూర్యనాగేంద్ర (23) అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఆలయం వద్ద నిద్రిస్తున్న ఎ.కొత్తపల్లి గ్రామానికి చెందిన తూము లక్ష్మణరావు (47) కూడా దుర్మరణం పాలయ్యారు.
అక్కడ ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో జేసీబీ సాయంతో లారీ క్యాబిన్, ఆలయ శిథిలాలను తొలగించి చుక్కల శేఖర్, కానూరి సూర్యనాగేంద్ర, తూము లక్ష్మణరావు మృత దేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు తొండంగి ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుమార్తెకు సారె పంపి వచ్చి..
మృతుల్లో ఒకరైన లక్ష్మణరావుకు భార్య లోవలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఎ.కొత్తపల్లి గ్రామంలో కూలి పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 1న తన పెద్ద కుమార్తె నాగలక్ష్మి వివాహం జరిగింది. శనివారం కొమ్మనాపల్లిలో తన వియ్యపు వారింటికి కుమార్తెకు సారెను కుటుంబ సభ్యులతో కలసి తీసుకెళ్లారు. అనంతరం అర్ధరాత్రి ఒంటి గంటకు స్వగ్రామం ఎ.కొత్తపల్లికి వచ్చారు. పెళ్లింట బంధువులు ఎక్కువగా ఉండటంతో ఖాళీ లేక లక్ష్మణరావు దగ్గరలోని వినాయకుని ఆలయంలో సేద తీరారు. ఇంతలో టిప్పర్ లారీ మృత్యువు రూపంలో కబళించింది. దీంతో లక్ష్మణరావు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లింట బంధువుల రోదనలతో విషాదం నెలకొంది.
చిన్న కుటుంబం.. పెద్ద కష్టం
ప్రత్తిపాడు రూరల్: గజ్జనపూడికి చెందిన టిప్పర్ డ్రైవర్ చుక్కల శేఖర్, క్లీనర్ కానూరి సూర్యనాగేంద్ర మృతితో ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. పదేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తూ శేఖర్ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అతనికి భార్య లోకేశ్వరి, కుమారుడు లలిత దుర్గామనీష్ (2), కుమార్తె అనితశ్రీ (10 నెలలు) ఉన్నారు. ఆ చిన్న కుటుంబానికి అతనే ఆధారం. పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది.
ప్రేమ పెళ్లి చేసుకున్న ఏడాదికే..
లారీ క్లీనర్ కానూరి సూర్యనాగేంద్ర (23) ఏడాది కిందట పొదురుపాకకు చెందిన శివకుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. ఇంతలో ఈ ప్రమాదం తీవ్ర శోకాన్ని మిగిల్చింది. వివాహం కావాల్సిన సోదరితో పాటు తల్లిదండ్రులు నాగేంద్రతో ఉంటున్నారు. అతని మృతితో ఆ కుటుంబానికి ఆసరా లేకుండా పోయింది. మృతుల కుటుంబాలు ప్రధాన జీవనాధారమైన పెద్దదిక్కులను కోల్పోయి రోడ్డున పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment