రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు | Sakshi
Sakshi News home page

రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు

Published Tue, May 7 2024 11:45 AM

రాజకీ

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం

రెండుసార్లు ఎమ్మెల్సీ

స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో కార్యక్రమాలు

జై ఆంధ్రా, ఎమర్జెన్సీ నిరసనలతోజైలు జీవితం

జాతీయ ప్రముఖులతో సాన్నిహిత్యం

కొత్తపేట: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ రాజకీయ చరిత్రలో మంతెన వెంకట సూర్య సుబ్బరాజు (ఎంవీఎస్‌ సుబ్బరాజు) మూడున్నర దశాబ్దాల పాటు తనదైన ప్రత్యేక శైలిలో రాజకీయాలు నడిపి రాజకీయ అపర చాణక్యుడిగా పేరు పొందారు. ఈ నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యే కళా వెంకట్రావు కాగా, ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో రెండో ఎమ్మెల్యేగా గెలిచారు సుబ్బరాజు. రాష్ట్ర మంత్రిగా, జాతీయ కాంగ్రెస్‌ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన కళా వెంకట్రావు తరహాలోనే ఎంవీఎస్‌ కూడా ఈ నియోజకవర్గానికి రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో గుర్తింపు తీసుకువచ్చారు. ఈ నియోజకవర్గంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకై క నాయకుడు ఆయన. ఈ నియోజకవర్గం నుంచి రెండో, మూడో, నాలుగోసారి ఎమ్మెల్యేగా వరుస విజయాలతో హ్యాట్రిక్‌ సాధించిన ఘనత సుబ్బరాజుదే. అయిదోసారి జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన ఎంవీఎస్‌ ఆరోసారి మళ్లీ విజయం సాధించారు.

జాతీయ ప్రముఖులతో సాన్నిహిత్యం

మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కమ్యూనిస్టు అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య, స్వాతంత్య్ర సమరయోధులు ఆచార్య ఎన్జీ రంగా, వావిలాల గోపాలకృష్ణ, గౌతు లచ్చన్న, బెజవాడ గోపాలరెడ్డి, తరిమెళ్ల నాగిరెడ్డి వంటి ఎందరో ప్రముఖులతో సుబ్బరాజుకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, గవర్నర్‌ మర్రి చెన్నారెడ్డి అయితే ప్రత్యేకంగా మూడు రోజులు కొత్తపేటలో సుబ్బరాజు ఇంట విడిది చేశారు. వారితో ఆయన అంత సన్నిహితంగా ఉండేవారు. అందుకనే ఆయనకు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాజకీయంగా మంచి పలుకుబడి ఉండేది. ఆయన తన 20వ ఏట కొత్తపేట తాలూకా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, 25వ ఏట తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా, 1962 నుంచి 1969 వరకూ ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా, డ్రైనేజీ బోర్డు చైర్మన్‌గా, జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు.

తొలి పెద్దల సభలో పిన్న వయస్కుడిగా..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి శాసన మండలి(పెద్దల సభ)లో పిన్న వయస్కుడిగా ఎంవీఎస్‌ అడుగు పెట్టారు. అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కాగా.. 1958లో శాసన మండలిని అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ ప్రారంభించారు. మంత్రి కళా వెంకట్రావు సిఫారసుతో సీఎం సంజీవరెడ్డి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా సుబ్బరాజును నామినేట్‌ చేశారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి శాసనసభలో మంత్రిగా కళా, శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఎంవీఎస్‌ ప్రాతినిధ్యం వహించారు. 1959లో కళా వెంకట్రావు గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎంవీఎస్‌ పోటీ చేసి సీపీఐ అభ్యర్థి ఎం.సూర్యనారాయణపై విజయం సాధించారు. 1962 జనరల్‌ ఎన్నికల్లో సుబ్బరాజు స్వతంత్ర అభ్యర్థి ముత్యాల సుబ్బారాయుడుపై గెలుపొందారు. 1967 ఎన్నికల్లో కూడా సుబ్బారాయుడును ఓడించి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ సాధించారు. అయితే 1971లో ఎమర్జెన్సీ అనంతరం అప్పటి వరకూ తిరుగులేని శక్తిగా కొనసాగిన కాంగ్రెస్‌ పార్టీ.. చీలికలతో తన ప్రాభవం కోల్పోయింది. ఆ ప్రభావం కొత్తపేటపై కూడా పడింది. ఫలితంగా అప్పటి వరకూ కాంగ్రెస్‌లో వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన ఎంవీఎస్‌కు 1972 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కలేదు. అప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా దెందులూరి భానుతిలకం పోటీ చేయగా సుబ్బరాజు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం జరిగిన శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సుబ్బరాజు విజయ ఢంకా మోగించారు. 1978లో జనతా పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి చిర్ల సోమసుందరరెడ్డిపై విజయం సాధించి, కొత్తపేటకు నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1982లో టీడీపీ ఆవిర్భావంతో వ్యక్తుల ప్రాబల్యం పోయి, రాజకీయ పార్టీల ఆధిపత్యం వచ్చింది. ఈ పరిస్థితుల్లో సుబ్బరాజు 1983లో స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి వైదొలిగారు. నియోజకవర్గంలో తన సామాజికవర్గ బలం అంతగా లేకపోయినప్పటికీ నీతి, నిజాయితీలతో ప్రజలను ఆకట్టుకుని సుబ్బరాజు వరుస విజయాలు సాధించారు. నియోజవర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.

బాల్యం నుంచీ దేశం కోసం పోరాటం

పూర్వపు కొత్తపేట తాలూకా గంటి పెదపూడి సుబ్బరాజు స్వగ్రామం. 1926 ఫిబ్రవరి 12న ఆయన జన్మించారు. గాంధీజీ నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటంపై ఆకర్షితులైన సుబ్బరాజు పలువురు స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని పొంది ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు, 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ సందర్భంగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో సుబ్బరాజు ఏడాది జైలు జీవితం గడిపారు.

రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
1/1

రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు

Advertisement
 
Advertisement