ఇసుక దోపిడీపై కన్నెర్ర
● ఉచిత ఇసుక అమలు తీరుపై భవన
నిర్మాణ కార్మికుల మండిపాటు
● కూటమి విధానంతో నిర్మాణ రంగం
కుదేలైందని ఆవేదన
● సామాన్యులకు ఇసుక
అందుబాటులోకి తేవాలని డిమాండ్
● కలెక్టరేట్ వద్ద ధర్నా
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం భవన నిర్మాణ రంగానికి శాపంగా మారింది. నిర్మాణ రంగంలో ప్రధానమైన ముడి సరకు ఇసుక. కూటమి ప్రభుత్వ విధానం పుణ్యమా అని.. పేరుకు ఉచితమే అయినా.. ఇసుక కోసం వస్తున్న వారిని అధికారం అండతో అక్రమార్కులు ఎక్కడికక్కడ నిలువు దోపిడీ చేస్తున్నారు. ముక్కుపిండి మరీ అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఒక యూనిట్ ఇసుకను రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారంటే ఇసుక దోపిడీ ఏ రీతిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కంటే ఆఫ్‌లైన్‌లోనే ఇసుక విక్ర యాలు అధికంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం, అధికారులు చెబుతున్న మాటలకు, ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద పరిస్థితికి ఏమాత్రం పొంతన ఉండటం లేదు. పలు ర్యాంపుల్లో రాత్రి వేళ యథేచ్ఛగా ఇసుక తవ్వుతూ వందలాది లారీల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ఫలితంగా ఇసుక అందుబాటులో లేకుండా పోవడంతో నిర్మాణ రంగం ఎక్కడికక్కడ కుదేలైంది. పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. అప్పులపాలై, అర్ధాకలితో, పస్తులతో, దుర్భర పరిస్థితుల్లో కాలం గడుపుతున్నారు. వీరితో పాటు ఈ రంగంపై పరోక్షంగా ఆధారపడి ఉన్న ప్లంబింగ్, ఎలక్ట్రికల్, సెంట్రింగ్, రాడ్ బెండింగ్, పెయింటింగ్ తదితర కార్మికులు కూడా ఉపాధి దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ఊళ్లో పనులు లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పలువురు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం తమకు ఈ దుస్థితి తీసుకుని వచ్చిందంటూ భవన నిర్మాణ కార్మికులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమార్కులు కొద్ది నెలలుగా ఇసుక దోపిడీకి పాల్పడటం.. ఉచితం పేరుతో సామాన్యులకు ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడటంతో కడుపు మండిన భవన నిర్మాణ కార్మికులు సోమవారం ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వమే ఇసుక ర్యాంపులను నిర్వహించాలని, ఇసుకపై అన్ని రకాల పన్నులూ ఎత్తివేయాలని, ఇసుకాసురులను కఠినంగా శిక్షించాలని, ఇసుకను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని, భవన నిర్మాణ కార్మి కులకు ఉపాధి కల్పించాలని, నిర్మాణ రంగంలో వసూ లు చేస్తున్న ఒక్క శాతం సెస్‌ను తమ సంక్షేమానికే ఉపయోగించాలని, సిమెంట్, ఇనుము వంటి గృహోపకరణాల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. తమ ఇబ్బందులు కలెక్టర్‌కు చెప్పుకుందామని ప్రయత్నించిన వారిని పోలీసులు కలెక్టరేట్ ప్రాంగణం బయటే నిలువరించారు. అటు ప్రభుత్వం వినక, ఇటు అధికారులు పట్టించుకోకపోతే తమ పరిస్థితి ఏమిటంటూ పలువురు భవన నిర్మాణ కార్మికులు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కె.రాంబాబు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment